Free Sewing Machine: ఏపీలో ఉచిత కుట్టుమిషన్లు.. ట్రైనింగ్.. పూర్తి వివరాలు ఇవీ!

Free Sewing Machine: తెలంగాణలో ప్రభుత్వం మైనార్టీలకు ఉచిత కుట్టు మిషన్లు ఇస్తుండటం మీరు చూసి ఉంటారు. ఇదే విధంగా ఏపీలో కూడా ఇస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. సమాజానికి ఏదో ఒక మేలు చెయ్యాలని కొంతమంది ప్రయత్నిస్తారు. అలాంటి వారు స్వచ్ఛంద సంస్థ (NGO)లు స్థాపిస్తారు. అలా ఆ సంస్థ ద్వారా నలుగురికీ ఏదో ఒక విధంగా సహాయం చేస్తూ.. గొప్పవారిగా నలుగురి ప్రశంసలూ అందుకుంటారు. అలాంటి ఒక సంస్థ నెల్లూరు జిల్లాలోని కావలిలో ఉంది. పేరు శ్రీ సాయి చారిటబుల్ ట్రస్ట్. ఈ సంస్థ నిర్వాహకురాలైన పొన్నగంటి మాధవి.. పేద మహిళలకు కుట్టుపనిలో ఉచితంగా శిక్షణ ఇప్పిస్తూ.. కుట్టు మిషిన్లు కూడా ఇప్పిస్తున్నారు.
ఇటీవల సాయి చారిటబుల్ ట్రస్ట్ అధ్వర్యంలో.. ప్రవాస భారతీయుడైన మింది శ్రీనివాస్ సౌజన్యంతో.. కుట్టుపనిలో ట్రైనింగ్ పూర్తి చేసుకున్న నలుగురు మహిళలకు దాతల సాయంతో కుట్టు మిషన్లు ఇచ్చారు. డీఎస్పీ శ్రీధర్ అధ్వర్యంలో కుట్టు మిషన్ల పంపిణీ జరిగింది. ఇలా కుట్టుపని నేర్పించడం, తోటి మహిళలకు కుట్టు మిషన్లు ఇప్పించడంలో ఎంతో సంతృప్తి ఉంటుందని పొన్నగంటి మాధవి తెలిపారు. దాతలు ఎవరైనా సాయం చేస్తే, ఆ డబ్బుతో వెంటనే కుట్టు మిషన్లు కొని ఇచ్చేస్తున్నారు. ఇలా చాలాసార్లు చేశారు. తద్వారా ఎంతో మంది మహిళలకు ఆమె కెరీర్ అందిస్తున్నారు. ఈ ట్రస్ట్ అధ్వర్యంలో యువతులు, మహిళలు, ముసలివారు సైతం కుట్టుపని నేర్చుకుంటున్నారు. ఆమె కృషిని మెచ్చి దాతలు డబ్బు సాయం చేస్తున్నారు. అలా ఆ డబ్బును ఆమె నలుగిరికీ ఉపయోగపడేలా చేస్తూ.. అందరిచేతా ప్రశంసలు అందుకుంటున్నారు. అసలు మాధవి ఇలాంటి సేవ చేస్తుండటానికి కారణం ఆమె తండ్రి. ఆమె చిన్నప్పుడు.. కుట్టుపని నేర్చుకోవాలని ఉంది అని తండ్రికి చెప్పగా.. ఆయన కూతురి కోరిక తీర్చారు. చక్కగా ట్రైనింగ్ ఇప్పించారు. ఆ తర్వాత ఒక కుట్టుమిషన్ కూడా కొన్నారు. దాని ద్వారా ఆమె యువతిగా ఉన్నప్పుడే.. కొంత ఆదాయం పొందారు. ఆ తర్వాత పెళ్లైంది. తన ఇద్దరు పిల్లలకూ కుట్టుపని నేర్పించారు. అదే క్రమంలో నలుగురికీ నేర్పించాలని సంకల్పించి.. అదే చేస్తున్నారు.


