ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అగ్ని ప్రమాదం.. 20 మందికి పైగా మృతి!

కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర విషాదం చోటు చేసుకుంది. ఈరోజు ( అక్టోబర్ 24, 2025 ) శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు కర్నూలు శివారు చిన్నటేకూరు వద్ద జాతీయ రహదారి 44పై అగ్నిప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 40 మంది ప్రయాణికులు ఉన్నట్టు చెబుతున్నారు. మిగిలిన వారిలో 12 మంది స్వల్ప గాయాలతో బయటపడగా.. మరికొందరు తీవ్ర గాయాలపాలయ్యారు. బాధితులను కర్నూలు సర్వజన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ అనూహ్య ఘటన ఏపీ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఏం జరిగిందంటే.. ప్రైవేట్ ట్రావెల్ బస్సు కర్నూలు నగర శివారులోని ఉలిందకొండ సమీపంలో బస్సు వెళ్తుండగా.. ఒక ద్విచక్రవాహనం బస్సును ఢీకొట్టింది. ఆ బైక్ బస్సు కిందకు దూసుకుపోయి ఇంధన ట్యాంకును తాకడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి బస్సు అంతా వ్యాపించాయి. మంటలు చెలరేగిన సమయంలో ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండగా.. అప్రమత్తమైన 12 మంది ప్రయాణికులు బస్సు అద్దాలను ధ్వంసం చేసుకుని కిందకు దూకేశారు.
అయితే మిగిలిన వారు మంటల్లో చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మొత్తం 4 ఫైరింజన్లతో మంటలను అదుపు చేయగా బస్సు పూర్తిగా కాలిపోయింది. ప్రయాణికుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ వాసులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం నుంచి బయటపడిన వారిలో రామిరెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, సత్యనారాయణ, శ్రీలక్ష్మి, నవీన్‌కుమార్, అఖిల్, జష్మిత, అకీర, రమేష్, జయసూర్య, సుబ్రహ్మణ్యం సహా పలువురు ఉన్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే బస్సులోని ఇద్దరు డ్రైవర్లు పరారైనట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ప్రమాదంపై దుబాయ్ పర్యటనలో ఉన్న సీఎం నారా చంద్రబాబు నాయుడు సైతం విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు తన ప్రగాడ సానుభూతి తెలియజేశారు. గాయపడిన, బాధిత కుటుంబాలకు ప్రభుత్వ అధికారులు అన్ని విధాలుగా సహాయం అందిస్తారని పేర్కొన్నారు. అలానే మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ అనూహ్య ఘటన ఎంతో కలిచి వేసిందని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం ప్రకటించిన ఆయన.. వాళ్లకు ప్రభుత్వం ఉదారంగా ఆదుకోవాలని.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని కోరారు.
మరోవైపు ఈ బస్సు ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపిన ఆయన.. ఏపీ అధికారులతో మాట్లాడి అవసరమైన సహాయ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అధికారులను ఆదేశించారు.

