Electric Scooter: ఈ కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం ఎగబడిన జనం.. ఒక్క నెలలోనే..!

Electric Scooter: దేశంలో ఎలక్ట్రిక్ టూవీలర్లకు మంచి డిమాండ్ ఉంది. అయితే, దసరా, దీపావళి పండగ సీజన్‌లో కంపెనీలు పలు ఆఫర్లు ప్రకటించడంతో వాటిని పెద్ద ఎత్తున ఉపయోగించుకున్నారు. ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ కంపెనీ ఏథర్ ఎనర్జీ అక్టోబర్ నెల గణాంకాలను విడుదల చేసింది. ఒక్క నెలలోనే 20 వేల స్కూటర్లు విక్రయించినట్లు తెలిపింది. దీంతో మార్కెట్ వాటాను భారీగా పెంచుకుంది. పండగ ఆఫర్లలో పలు స్కూటర్లపై రూ.25 వేల వరకు బెనిఫిట్స్ కల్పిస్తోంది. ఆ వివరాలు తెలుసుకుందాం.
Electric Scooter: దేశీయ ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్లో చాలా కంపెనీలు తమ ఉత్పత్తులను విక్రయిస్తున్నాయి. ప్రజలు ఎక్కువగా ఆదరిస్తున్న కంపెనీల్లో ఏథర్ ఎనర్జీ (Ather Energy) ఒకటి. ఈ కంపెనీ దసరా, దీపావళి పండగ సందర్భంగా పలు ఆఫర్లు ప్రకటించింది. తమ కంపెనీకి చెందిన కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లపై రూ.25 వేల వరకు తగ్గింపు ప్రయోజనాలు కల్పించింది. ఈ ఆఫర్లు ప్రకటించిన క్రమంలో కంపెనీకి ఊహించని విధంగా సేల్స్ పెరిగాయి. కంపెనీ చరిత్రలోనే నెల రోజుల సేల్స్‌లో అత్యధిక సేల్స్ గత అక్టోబర్ నెలలోనే నమోదైనట్లు ఏథర్ ఎనర్జీ ప్రకటించింది.
ఈ పండగల సీజన్ నేపథ్యంలో అక్టోబర్ నెలలో దేశవ్యాప్తంగా 20 వేల స్కూటర్లు సరఫరా చేసినట్లు ఏథర్ ఎనర్జీ తెలిపింది. ఇప్పటి వరకు సేల్స్ పరంగా చూస్తే ఒక్క నెలలో జరిగిన అత్యధిక సేల్స్ ఇదేనని తెలిపింది. సేల్స్ పెరగడంలో కొత్తగా లాంచ్ చేసిన ఫ్యామిలీ స్కూటర్ ఏథర్ రిజ్టా ( Ather Rizta) ప్రధాన పాత్ర పోషించినట్లు వెల్లడించింది. అక్టోబర్ నెల మొత్తం సేల్స్‌లో ఈ స్కూటర్ సేల్స్ 60-70 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. అక్టోబర్ 30వ తేదీన నాటికి దేశవ్యాప్తంగా మొత్తం 20 వేల స్కూటర్లు విక్రయాలు జరిపినట్లు తెలిపింది. మరోవైపు.. అంతకు ముందు సెప్టెంబర్ నెలలో 12,828 స్కూటర్లు విక్రయించింది.
జులై, 2024 నెలలో దేశీయ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో ఏథర్ వాటా 7.9 శాతంగా ఉండగా అది సెప్టెంబర్ నాటికి 14.3 శాతానికి పెరిగింది. ఇప్పుడు తమ వాటాను దాదాపు 20 శాతానికి పెంచుకున్నట్లు తెలుస్తోంది. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. అక్టోబర్ నెలలో ఇయర్ ఆన్ ఇయర్ ప్రాతిపదికన చూసుకుంటే 70 శాతం వృద్ధి నమోదైనట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏథర్ ఎనర్జీ కంపెనీకి 2500 ఛార్జింక్ స్టేషన్లు, 231 సర్వీస్ సెంటర్లు ఉన్నాయి.

