ప్రతి రోజూ కాఫీ తాగితే మీ రక్తంలో ఏం జరుగుతుందో తెలుసా? షుగర్ రోగులు ఏం తెలుసుకోవాలంటే

కాఫీ తాగే అలవాటు ఉన్నవారి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కాఫీ తాగితే రక్తంలో షుగర్ లెవల్స్‌పై ఎలాంటి ప్రభావం ఉంటుంది, డయాబెటిస్ రోగులు కాఫీ తాగవచ్చా అన్న పూర్తి వివరాలపై ఓ లుక్కేద్దాం. చాలా మందికి నిద్ర లేచిన వెంటనే కాఫీ తాగే అలవాటు ఉంటుంది. చాలా మంది ఉదయం ఒక కప్పు కాఫీతో ప్రారంభిస్తారు. ఇక, ఆఫీస్‌లో వర్క్ చేసే వారు ఏదో ఒక సమయంలో కాఫీ బ్రేక్ తీసుకుంటారు. విరామంలో కాఫీ తాగుతూ రిలాక్స్ అవుతారు. అవును కాఫీ కేవలం ఒక డ్రింక్ మాత్రమే కాదు. ఇది చాలా మందికి శక్తినిచ్చేది. రోజంతా ఆఫీస్‌లో వర్క్ చేసి ఆలసిపోయినప్పుడు కాఫీ తాగితే.. నీరసం నుంచి బయటపడవచ్చు. అయితే, మీరు రోజూ తాగే కాఫీ మీ రక్తంలో ఎలాంటి ప్రభావం చూపుతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ప్రతి రోజూ కాఫీ తాగితే రక్తంలో షుగర్ లెవల్స్‌పై ఎలాంటి ప్రభావం ఉంటుంది, డయాబెటిస్ రోగులు తాగొచ్చా అన్న పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.కాఫీలోని కెఫిన్ ఉంటుందని మనకు తెలిసిన విషయమే. ఈ కెఫిన్ రక్తంలో చక్కెర స్థాయిల్ని తాత్కాలికంగా పెంచుతుందని కొన్ని అధ్యయనాలు (మాయో క్లినిక్, వెబ్ ఎమ్‌డి) సూచిస్తున్నాయి. ఎందుకంటే కెఫిన్ ఒత్తిడి హార్మోన్లు అడ్రినలిన్ వంటి వాటిని పెంచుతుంది. ఇది కణాల చక్కెరను ప్రాసెస్ చేసే సామర్థ్యాన్ని తాత్కాలికంగా తగ్గిస్తుంది. ఇది ఇన్సులిన్ సున్నితత్వాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అంటే శరీరంలో మీ కణాలు ఇన్సులిన్ హార్మోన్‌కు తగిన విధంగా స్పందించవు.ఈ విషయం కొంచెం గందరగోళంగా అనిపించవచ్చు. కాఫీలో కెఫిన్ మాత్రమే కాకుండా, యాంటీఆక్సిడెంట్లు, మెగ్నీషియం వంటి అనేక ఇతర బయోయాక్టివ్ సమ్మేళనాలు కూడా ఉంటాయి. ఈ మూలకాలు శరీరంలో మంటను తగ్గించడంలో అంటే ఇన్ఫ్లమేషన్ లెవల్స్ తగ్గించడంలో సాయపడతాయి. అంతేకాకుండా ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో కూడా తోడ్పడతాయని మరికొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇది దీర్ఘకాలంలో రక్తంలో చక్కెరను మెరుగుపరుస్తుంది.అసలు విషయం ఇక్కడే ఉంది. మీరు ఏ కాఫీ తాగుతున్నారన్న విషయంలో అసలు మ్యాటర్ ఉందని నిపుణులు అంటున్నారు. చక్కెర, క్రీమ్ లేదా ఫ్లేవర్డ్ సిరప్‌లు వంటివి కాఫీకి యాడ్ చేస్తే ఖచ్చితంగా అది.. మీ రక్తంలో చక్కెరను పెంచుతుంది. కానీ చక్కెర, పాలు లేకుండా తాగే బ్లాక్ కాఫీలో కేలరీలు, కార్బోహైడ్రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. అందుకే బ్లాక్ కాఫీ బెస్ట్ ఆప్షన్ అంటున్నారు నిపుణులు.

