మీ దేవుడి గదిలో బల్లులు ఉంటే ఏం జరుగుతుందో తెలుసా…?

హిందూ సంప్రదాయంలో బల్లులకు ఒక విచిత్రమైన, ప్రత్యేకమైన స్థానం ఉంది. కొన్ని ఆలయాల్లో వీటిని ఏకంగా దైవంగా భావించి పూజిస్తారు. ఉదాహరణకు, కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్ ఆలయంలో బల్లులను బంగారం, వెండితో చెక్కి పూజిస్తారు. ఇలా చేయడం వల్ల మంచి జరుగుతుందని, కీడు తొలగిపోతుందని భక్తులు బలంగా నమ్ముతారు. అదేవిధంగా, తిరుచ్చిలోని శ్రీరంగం ఆలయంలోని స్వర్గద్వారం దగ్గర బంగారు బల్లుల చిత్రాలుంటాయి. భక్తులు వాటిని పూజించి, ఆ తర్వాతే ఆలయంలోకి ప్రవేశిస్తారు.
ఇంటి బల్లి: ఆశీర్వాదమా.. ఆందోళనా? సాధారణంగా బల్లులు వెచ్చగా, సురక్షితంగా ఉండే ప్రదేశాలను ఇష్టపడతాయి. మన ఇళ్ళలో దేవుడి పటాల వెనుక ఉండే చిన్న ఖాళీ ప్రదేశాలు వాటికి ఆశ్రయం కల్పిస్తాయి. కొందరు దీన్ని దేవుడి ఆశీర్వాదంగా, ఇంట్లో అదృష్టాన్ని, రక్షణను తెచ్చే సంకేతంగా భావిస్తారు. బల్లులు ఇంట్లో ఉంటే శుభమని, పాజిటివ్ ఎనర్జీ వస్తుందని నమ్మేవారు చాలా మంది ఉన్నారు.
అయితే, అందరూ ఇలానే అనుకోరు. మరికొందరు బల్లులను అపరిశుభ్రంగా, అసహ్యంగా భావిస్తారు. అలాంటి వారికి దేవుడి పటాల దగ్గర బల్లులు కనిపించడం చెడు సంకేతంగా లేదా ప్రతికూల శక్తిగా అనిపించవచ్చు. ముఖ్యంగా బల్లులంటే భయపడే వారికి ఇది ఆందోళన కలిగించే విషయం. మీ నమ్మకాన్ని బట్టి.. నిజానికి, బల్లులు ఇంట్లో ఉండటం అనేది ఒక సాధారణ పర్యావరణ ప్రక్రియ మాత్రమే. అయితే, ఈ విషయాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారనేది పూర్తిగా మీ వ్యక్తిగత నమ్మకాలు, ఆధ్యాత్మిక దృక్పథంపై ఆధారపడి ఉంటుంది. ఆధ్యాత్మికంగా దీనిని చూసేవారు మంచి శకునంగా భావించవచ్చు, అదే అసహ్యంగా భావించేవారు ప్రతికూల సంకేతంగా చూడవచ్చు.

