సరిగా నిద్రపోకపోతే 172 జబ్బుల ముప్పు, డయాబెటిస్ తో పాటు కిడ్నీ ఫెయిల్యూర్, ఇంకేం జరుగుతుందో తెలుసా ?

నిద్రపట్టట్లేదు. ఎవరిని అడిగినా ఇదే విషయం చెప్తారు. రోజంతా పని హడావుడిలో పడిపోయి రాత్రి కాస్తంత రెస్ట్ తీసుకునే టైమ్ లో బాడీకి విశ్రాంతి ఇవ్వకుండా మేల్కొనే ఉంటున్నారు. ఎందుకిలా అని అడిగితే..నిద్ర పట్టడం లేదు అంటారు. కానీ..నిద్ర పట్టడానికి ఏం చేయాలన్నది మాత్రం ఆలోచించరు. రాత్రంతా మేల్కొని ఉండడం అనేది ఓ వ్యసనంగా మారిపోయింది. ఫోన్ లో రీల్స్ చూడడం, వెబ్ సిరీస్ లు చూస్తూ కూర్చోవడం లాంటివి చేస్తున్నారు. ఒకటి రెండు రోజులు అంటే బాడీ మెటబాలిజం ఏదో విధంగా తరవాత సెట్ అవుతుంది. కానీ..రోజూ ఇలాగే చేయడం వల్ల ఆరోగ్యం దెబ్బ తింటుంది. అయితే..ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఓ స్టడీ అంత కన్నా ఆందోళన కలిగించే విషయం వెల్లడించింది. నిద్రలేమి వల్ల ఏకంగా 172 జబ్బులు వచ్చే ముప్పు ఉందని తేల్చి చెప్పింది. అంటే..ఎంతగా ఎఫెక్ట్ పడుతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ అధ్యయనానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
నిద్రలేమి
నిద్ర. ఇది ఎంత మోతాదులో ఉండాలో అంత మోతాదులోనే ఉండాలి. కాస్త ఎక్కువైనా కష్టమే. తక్కువైనా ఇబ్బందే. మరీ అతిగా నిద్రపోవడం వల్ల గుండె జబ్బులతో పాటు డిప్రెషన్ కూడా వస్తుందని ఇప్పటికే చాలా మంది వైద్య నిపుణులు హెచ్చరించారు. కానీ..ఇప్పుడు వెలుగులోకి వచ్చిన కొత్త అధ్యయనం మాత్రం మరి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. సుమారు 90 వేల మందిపై ఈ స్టడీ చేశారు. అందరికీ ఫిట్ నెస్ ట్రాకర్స్ ఇచ్చారు. దాదాపు ఏడేళ్ల పాటు సాగింది ఈ అధ్యయనం. ఎవరెవరు ఎప్పుడు నిద్రపోతున్నారు. ఎంత సేపు పడుకుంటున్నారు. క్వాలిటీ స్లీప్ ఉంటోదా లేదా అని అన్న రకాలుగా రీసెర్చ్ చేశారు. హెల్త్ డేటా సైన్స్ అనే ఓ జర్నల్ లో ఈ అధ్యయనానికి సంబంధించిన పూర్తి వివరాలు పబ్లిష్ చేశారు. అసలు ఈ స్టడీలో ఏముంది. ఏయే వివరాలు వెల్లడించారో చూద్దాం.ఇందాకే చెప్పినట్టుగా సుమారు 90 వేల మందిపై ఈ అధ్యయనం జరిపారు. రోజుకి 8 గంటలకు పైగా నిద్రపోతామని చెప్పిన వారు నిజానికి ఆరు గంటలు..అంత కన్నా తక్కువే నిద్రపోతున్నారు. స్లీప్ క్వాలిటీ ఆధారంగా చూస్తే వాళ్లు నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారు. అయితే..ఈ అధ్యయనంలో అందరి స్లీపింగ్ ప్యాటర్న్ ని కూడా గమనించారు సైంటిస్ట్ లు. ఎన్ని గంటల పాటు గాఢ నిద్రలో ఉంటున్నారన్నది చెక్ చేశారు. అంతే కాదు. ఏ ప్యాటర్న్ ప్రకారం వాళ్లు నిద్రపోతున్నారు అన్నదీ గమనించారు. ఇదంతా తెలుసుకోవడం కోసం యాక్సెలెరోమీటర్స్ వినియోగించారు. వాళ్ల మణికట్టుకి ట్రాకర్స్ అమర్చారు. ఆ తరవాతే షాకింగ్ నిజాలు తెలిశాయి. ఎవరైతే కలత నిద్రలో ఉంటున్నారో, స్లీప్ క్వాలిటీ బాగుండడం లేదో వారికి దాదాపుగా 172 జబ్బులు వచ్చే ముప్పు ఉందని గుర్తించారు. అందులో దీర్ఘకాలిక రోగాలు కూడా ఉన్నాయి.
