గ్రామ పంచాయతీలు అన్ని రంగాల్లో స్వావలంబిగా మారాలని, పంచాయతీరాజ్ శాఖలో పారదర్శక పాలన అమలు చేస్తున్నామని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. ప్రతి గ్రామంలో జాతీయ సమగ్రతకు ప్రతీకగా స్తూపాలు నిర్మించాలన్న సూచనతో పాటు, ఉపాధి శ్రామికులను గౌరవపూర్వకంగా పిలవాలన్నారు.
అమరావతి, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థలు అన్ని రంగాల్లో స్వావలంబన సాధించి స్థానిక ప్రభుత్వాలుగా మారేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పిలుపిచ్చారు. దానికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. ప్రతి గ్రామ పంచాయతీలో జాతీయ సమగ్రతా ప్రాంగణాలు నెలకొల్పాలని, అక్కడే జాతీయ స్తూపం నిర్మించాలన్నారు. పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా గురువారం మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.
గ్రామ పంచాయతీలు బలంగా ఎదగాలని.. ఆర్థిక, సామాజిక, రాజకీయ సమన్వయంతో ఐక్యంగా పనిచేయాలని.. అన్ని రంగాల్లో స్వయంప్రతిపత్తి సాధించాలని.. అభివృద్ధి, ఆకాంక్షలు కలగలిపి స్వర్ణ గ్రామాలుగా వెలగాలని ఆకాంక్షించారు. ‘కూటమి ప్రభుత్వంలో చాలా ఇష్టంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలను చేపట్టాను. 2 నెలల పాటు సమగ్ర పరిశీలన చేసిన తర్వాత అధికారుల సమావేశంలో నేను చెప్పింది ఒక్కటే.. ఏ పనికి ఎంత కేటాయింపు జరిగిందో అదే పనికి నిధులు ఖర్చు చేయాలి. పారదర్శకంగా పనులు జరగాలని.. ఎలాంటి మళ్లింపులు, వృధా ఖర్చులు లేకుండా పల్లెల్లో సౌకర్యాలు, వసతులు సమకూరాలని చెప్పాను. ఆ ప్రకారమే ఇప్పుడు పనులు జరుగుతున్నాయి’ అని తెలిపారు. సిబ్బంది బదిలీలు ఎన్నడూ జరగనంత పారదర్శకంగా జరిపామన్నారు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో సమూల మార్పులు తీసుకొచ్చామని, దీని ఫలితమే సమష్టి కృషితో పల్లెల్లో పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ఈ విషయంలో ఎంతో కృషి చేస్తున్నారంటూ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, కమిషనర్ కృష్ణతేజకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పనులను వేగవంతంగా పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు సంబంధించిన బిల్లులు త్వరలోనే అందుతాయని భరోసా ఇచ్చారు. ఉపముఖ్యమంత్రి ఇంకా ఏం చెప్పారంటే..
