Cyber ​​criminals who have changed their route… are also cashing in on devotion… be careful with these calls

రూటు మార్చిన సైబర్ నేరగాళ్లు.. భక్తిని కూడా క్యాష్ చేసుకుంటున్నారు.. ఈ కాల్స్‌తో జాగ్రత్త

సైబర్ కేటుగాళ్లు ఇప్పుడు భక్తి పేరుతో అమాయకులను మోసం చేస్తున్నారు. విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానం పేరు చెప్పి, అమ్మవారి పట్టు చీరలు ఇంటికి పంపిస్తామని, ప్రత్యేక పూజలు చేస్తామని నమ్మించి డబ్బులు గుంజుతున్నారు. అధికారులు అప్రమత్తమై, ఇలాంటి ఫోన్ కాల్స్‌ను నమ్మి మోసపోవద్దని భక్తులకు సూచిస్తున్నారు. అధికారిక వెబ్‌సైట్, మనమిత్ర వాట్సాప్ ద్వారానే సేవలు పొందాలని ఆలయ ఈవో భక్తులకు సూచించారు.

ఆంధ్రప్రదేశ్‌‌లో సైబర్ మోసాలు రోజు, రోజుకు పెరిగిపోతున్నాయి.. పోలీసులు ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నాసరే కొందరు అమాయకులు బలవుతున్నారు. సైబర్ కేటుగాళ్లు ఇప్పుడు రూటు మార్చారు.. భక్తి పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. దేవుళ్ల పేరు చెప్పి అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. కొందరు కేటుగాళ్లు విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానం పేరుతో భక్తులను మోసం చేస్తున్నారు. అమ్మవారి పట్టు చీరలు నేరుగా ఇంటికి పంపిస్తామని.. తాము విజయవాడ ఆలయం నుంచి ఫోన్ చేస్తున్నామని నమ్మించి ముంచేస్తున్నారు.

పేరు, గోత్రాలతో పూజలు చేస్తామని చెప్పి కూడా విరాళాల రూపంలో డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ మోసాలపై కొందరు భక్తులు ఫిర్యాదు చేయడంతో విజయవాడ దుర్గమ్మ ఆలయ  అధికారులు అప్రమత్తమయ్యారు.. భక్తులకు ఈ విషయంపై అవగాహన కల్పిస్తున్నారు. దేవస్థానం పేరుతో ఎవరూ ఫోన్లు చేసి విరాళాలు లేదా డబ్బులు అడగరని ఈవో శీనానాయక్‌ స్పష్టం చేశారు. ఇలాంటి ఫోన్ కాల్స్‌ను నమ్మి మోసపోవద్దని భక్తులకు సూచించారు. సైబర్ నేరగాళ్లు భక్తుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని డబ్బులు గుంజడానికి ప్రయత్నిస్తున్నారన్నారు.

దేశవిదేశాల్లోని భక్తులను మోసం చేయడానికి కొందరు సైబర్ నేరగాళ్లు విజయవాడ ఆలయం పేరును వాడుకుంటున్నారు. డబ్బులు కడితే అమ్మవారి చీరలు పంపిస్తామని, ప్రత్యేక పూజలు చేస్తామని అపరిచిత వ్యక్తులు భక్తులను సంప్రదిస్తున్నారని శీనానాయక్‌ తెలిపారు. ఈ మోసాలపై భక్తులను అప్రమత్తం చేస్తున్నామన్నారు. భక్తులు తమకు అవసరమైన సేవల గురించి ఆలయ అధికారిక వెబ్‌సైట్, మనమిత్ర వాట్సాప్, సమాచార కేంద్రం సేవల ద్వారా తెలుసుకోవచ్చని సూచిస్తున్నారు. దేవస్థానం నుంచి ఎవరూ నేరుగా భక్తులను సంప్రదించి డబ్బులు అడగరని క్లారిటీ ఇచ్చారు. కొద్దిరోజులుగా దేవస్థానం పేరు చెప్పి కొందరు వ్యక్తులు భక్తులను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఇవన్నీ సైబర్ నేరగాళ్ల పనేనని.. ఈ మోసాల గురించి భక్తులకు తెలియజేయడానికి ఆలయ ప్రాంగణంలో మైకుల ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తున్నామన్నారు. సైబర్ నేరగాళ్ల విషయంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top