ప్రస్తుతం అనేకమంది ఆర్థిక లావాదేవీలు, కొనుగోళ్ల విషయంలో క్రెడిట్ కార్డులు ఉపయోగిస్తున్నారు. షాపింగ్ చేయాలన్నా, ఈఎంఐలు కట్టాలన్నా, బస్, ట్రైన్, ఫ్లైట్ టికెట్లు బుక్ చేయాలన్నా వెంటనే కార్డ్ తీసేసి గీకేస్తుంటారు. కానీ ఇలా చేయడం కంటే, నగదు చెల్లింపులే బెటర్ అంటున్నాయి న్యూరోసైన్స్ పరిశోధనలు. ఎందుకంటే క్రెడిట్ కార్డ్ ఉపయోగించడం మానసిక ఆరోగ్యంపై కొంత ప్రతికూల ప్రభావం చూపుతుంది. అదే నగదు చెల్లిస్తే అలర్ట్‌నెస్‌ను పెంచడంతోపాటు ఖర్చు ఆదా చేసేందుకు సహాయపడుతుందని పరిశోధనలు పేర్కొంటున్నాయి. అదెలాగో ఇప్పుడు చూద్దాం.
నగదు చెల్లింపుతో ప్రయోజనాలు
‘న్యూరాన్ జర్నల్’ అధ్యయనాలు, అలాగే బిహేవియరల్ ఎకనామిక్స్ పరిశోధనల ప్రకారం.. ఆర్థిక లావాదేవీల్లో నగదు చెల్లించడం వల్ల మెదడులోని నొప్పి, అలాగే రివార్డ్ కేంద్రాలు(Pain and reward centers), క్రెడిట్ కార్డులతో చెల్లించిన సందర్భం కంటే ఎక్కువగా యాక్టివేట్ అవుతాయి. ఈ ‘pain of paying’ అనేది ఒక మానసిక ఘర్షణను సృష్టిస్తుంది. పైగా ఇది ఖర్చు చేసే ప్రవర్తనను కంట్రోల్ చేస్తుంది. అంతేకాకుండా నగదు చెల్లించినప్పుడు, డబ్బు నష్టపోవడం అనే భావన తక్షణమే మెదడుకు తెలుస్తుంది. ఇది కొనుగోలు విషయంలో మరింత జాగ్రత్తగా నిర్ణయం తీసుకునేలా సహాయపడుతుంది.
క్రెడిట్ చెల్లింపులతో కలిగే నష్టాలు
ఇక చెల్లింపులకు తరచుగా క్రెడిట్ కార్డులు వినియోగించడమనేది మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఎందుకంటే క్రెడిట్ కార్డ్ వినియోగిస్తున్నప్పుడు మైండ్ మీరు నష్టపోతున్నామన్న భావనను పెద్దగా పట్టించుకోదు. పైగా ఆ విధమైన ఫీలింగ్‌ను వాయిదావేసేందుకు ప్రేరేపిస్తుంది. దీనివల్ల ఆ క్షణంలో మీ కొనుగోళ్లు తక్కువ ఖర్చుతో కూడుకున్నట్లు అనిపిస్తాయని ‘న్యూరాన్ జర్నల్’ అలాగే బిహేవియరల్ ఎకనామిక్స్ పరిశోధనలు ధృవీకరిస్తున్నాయి. దీంతోపాటు క్రెడిట్ కార్డుల వాడకం అధిక ఖర్చు, అప్పుల సేకరణకు దారితీసే అవకాశాన్ని కూడా పెంచుతాయి.
అప్పుల్లో కూరుకుపోకుండా..
క్రెడిట్ కార్డుల వాడకం వల్ల నష్ట భావన తగ్గడమనేది వినియోగదారులు ఎక్కువ ఖర్చు చేయడానికి, అప్పుల్లో కూరుకుపోవడానికి కారణం అవుతుంది. కానీ నగదు చెల్లింపులు అలా కాదు, తక్షణ ఆర్థిక నష్టాన్ని స్పష్టంగా గుర్తించేలా చేస్తాయి. ఇది ఖర్చు చేసే ముందు ఆలోచించేలా ప్రేరేపిస్తాయి. అయితే క్రెడిట్ కార్డులు ఈ అనుభూతిని వాయిదా వేయడం వల్ల, వినియోగదారులు తమ ఆర్థిక స్థితిని పూర్తిగా గ్రహించకుండా ఎక్కువ కొనుగోళ్లు చేయవచ్చునని అధ్యయనాలు చెబుతున్నాయి. వినియోగదారులు ఈ విధమైన తమ ఖర్చు అలవాట్లను గమనించి, నగదు లేదా డెబిట్ కార్డుల వంటి చెల్లింపు పద్ధతులను ఎంచుకోవడం ద్వారా ఆర్థిక నియంత్రణను మెరుగుపరచవచ్చని సూచిస్తున్నాయి.