జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగిందని చెబుతున్న లిక్కర్ కుంభకోణానికి సంబంధించి అనేకమంది ప్రముఖులు.. కీలక పాత్రధారులు, సూత్రధారులు అరెస్టు అయిన తర్వాత, చివరి విడతలో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి కూడా అరెస్టు అయ్యారు. అప్పటిదాకా ఆయన పాత్ర గురించి సూచనప్రాయంగా కూడా ఎక్కడా వెల్లడి కాలేదు.
అయితే మద్యం కుంభకోణంలో జగన్ దళాలు కాజేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సొమ్మును తరలించడంలోనూ.. ఎన్నికల అవసరాలకు ఆ సొత్తు ఖర్చు పెట్టడంలోనూ చెవిరెడ్డి కీలకంగా వ్యవహరించారనే ఆరోపణలతో సిట్ అరెస్టు చేసింది.
ఇప్పటిదాకా బెయిల్ దొరకని పరిస్థితుల్లో ఆయన జైల్లోనే గడుపుతున్నారు. తాజా పరిణామాలను బెయిల్ దరఖాస్తు విచారణ సందర్భంగా సిఐడి వినిపిస్తున్న వాదనలను గమనిస్తే.. ఒక చిన్న విషయంలో కక్కుర్తి పడిన కారణంగానే చెవిరెడ్డికి వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలు తయారైనట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు.
ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో.. కోట్ల రూపాయలు అక్రమంగా తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డాయి. అవి చెవిరెడ్డి మనుషులే తరలిస్తున్నట్లుగా అప్పట్లో ప్రముఖంగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత అదంతా కూడా మద్యం ముడుపుల ద్వారా కూడబెట్టిన సొత్తు మాత్రమే అని ఆరోపిస్తూ చెవిరెడ్డిని ఈ కుంభకోణంలో పాత్రధారిగా చేశారు.
నిజానికి ఇతరత్రా వనరుల నుంచి సమీకరించిన సొత్తును కూడా ఎన్నికల కోసం తరలించే అవకాశం ఉంది. అయితే అవకాశం ఉన్నది గనుక అదంతా మద్యం సొత్తు మాత్రమే అని బనాయించినట్లుగా కొందరు భావించేందుకు ఆస్కారం ఏర్పడింది. అదంతా పక్కన పెడితే ‘ఏ వాహనాలను వాడి సొత్తు తరలించే ప్రయత్నం చేశారు?’ అనేది ఇప్పుడు చెవిరెడ్డిని ఇరికించే బలమైన సాక్ష్యంగా కనిపిస్తోంది.
తుడాకు సంబంధించిన వాహనాలను వినియోగించి మద్యం లంచాల సొమ్మును తరలించారని సిఐడి వాదనలు వినిపిస్తోంది. ఆ తరలింపు సమయంలో తుడా వాహనాలు మరో ప్రాంతంలో ఎక్కడో ఉన్నట్లుగా లాగ్ పుస్తకాలలో తప్పుడు నమోదు చేశారు. కానీ హైవేలో టోల్ ప్లాజాల వద్ద సీసీ కెమెరాలు దృశ్యాలను పరిశీలిస్తే తుడా వాహనాలను ఆ మార్గంలో తిప్పినట్లుగా తేలిపోయింది. ఇది కావాలని చేసిన అక్రమంగా సాక్షాలతో సహా దొరికినట్లే!
సాక్షులు వాంగ్మూలాలు ఇచ్చినట్లుగా చెవిరెడ్డి ఆదేశిస్తేనే సొమ్మును తరలించినట్లు ఆయన వ్యక్తిగత భద్రత సిబ్బంది వాంగ్మూలం ఇచ్చినట్లుగాను, రకరకాల ఇతర సాక్ష్యాలు కూడా ఉన్నాయి. కానీ ఇవి పోలీసు విచారణలో ఉన్నట్టుగా కోర్టు ఎదుట కూడా ఆ వ్యక్తులు చెప్పినప్పుడు మాత్రమే వాటి వలన ఇబ్బంది! అదే సమయంలో తుడా వాహనాల విషయంలో లాగ్ బుక్ లలో ఒక రకమైన వివరాలు రాసి, ఆ ప్రాంతాలతో సంబంధం లేని హైవే ల మీద వాటిని నడిపిన వ్యవహారం తప్పించుకోలేని తప్పుగా కనిపిస్తోంది.
కోట్లకు కోట్ల రూపాయల అక్రమంగా తరలిస్తున్నప్పుడు నమ్మకస్తులైన మనుషులను ఆ పనిలో ఎలా వినియోగించుకుంటారు అదే మాదిరిగా తమకు ఎలాంటి సంబంధం లేని వాహనాలను వాడుకుని ఉంటే కొంత సేఫ్టీ ఉండేదేమో అని పలువురు అంచనా వేస్తున్నారు. వాహనాల విషయంలో కక్కుర్తి పడి తుడా వెహికల్స్ లో తీసుకువెళ్లడం వలన ఇవాళ పెద్ద సమస్య ఏర్పడినట్టుగా భావిస్తున్నారు. ఈ చిక్కుల నుంచి చెవిరెడ్డి ఎలా తప్పించుకుని బయటకు రాగలరో వేచి చూడాలి.
