ప్లాస్టిక్ బాటిల్స్‌తో బస్ షెల్టర్… అవార్డ్ కూడా వచ్చింది

హనుమకొండ జిల్లా ఉప్పులపల్లి గ్రామంలో ఎంపీడీవో పల్లవి ఆలోచనతో 2023లో ప్లాస్టిక్ బాటిళ్లతో బస్ షెల్టర్ నిర్మించారు. ఇది పర్యావరణ పరిరక్షణకు దోహదపడింది. స్ షెల్టర్ అనేది బస్సు కోసం వేచి ఉన్నప్పుడు ప్రయాణికులు ఆశ్రయించగలిగే ఒక నిర్మాణం. ప్రయాణికులు బస్సు కోసం వేచి ఉండడానికి మరియు ఎండ, వర్షం నుండి రక్షణ కల్పించే ఒక చిన్న నిర్మాణం. సాధారణంగా దీనిని గోడలు, పైకప్పుతో నిర్మిస్తారు. కాంక్రీట్, ఇనుము లేదా గ్లాస్‌తో నిర్మించబడతాయి. బస్ షెల్టర్ అనగానే మనం గోడలతో ఇనుము, స్టీల్ వాటితో నిర్మించినవి చూసుంటాం. కానీ ఇక్కడ మాత్రం వినూత్న రీతిలో ప్లాస్టిక్ బాటిళ్లతో బస్సు షెల్టర్‌ను నిర్మించారు.హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పులపల్లి గ్రామంలో ప్లాస్టిక్ బాటిళ్లతో నిర్మించినటువంటి ఈ బస్ షెల్టర్ అందరినీ ఆకట్టుకుంటుంది. పరకాల-హుజురాబాద్ ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న ఈ గ్రామంలో అప్పటి ఎంపీడీవో పల్లవి తన ఆలోచన ప్రయోగానికి ఈ ఊరు వేదికగా మారింది. ఈ ప్రత్యేకమైన చొరవ బస్‌స్టాప్ అవసరాన్ని పరిష్కరించడమే కాకుండా రీసైక్లింగ్ మరియు పర్యావరణ స్పృహను కూడా ప్రోత్సహిస్తుంది.
ఉప్పులపల్లి గ్రామం 2018లో గ్రామపంచాయతీగా మారింది. పల్లె ప్రకృతి చొరవతో భాగంగా గ్రామ పంచాయతీ సిబ్బంది ప్రతిరోజూ ప్రతి ఇంటి నుండి చెత్తను క్రమం తప్పకుండా సేకరిస్తారు. సేకరించిన వ్యర్థాలను డంప్ యార్డుకు రవాణా చేస్తారు. అక్కడ సిబ్బంది ప్లాస్టిక్ బాటిళ్లు ఇతర పదార్థాలను వేరు చేస్తారు. ప్లాస్టిక్ సీసాల సంఖ్య పెరుగుతుండడంతో ఓ సమస్యగా మారిపోయాయి. ఇదే అంశాన్ని పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ ఎంపీడీవో పల్లవికి చేరవేయడంతో ప్లాస్టిక్ బాటిళ్లతో బస్సు షెల్టర్ నిర్మించాలని ఎంపీడీవో వారికి సూచించారు. ఎంపీడీవో పల్లవి ఆలోచనతో 2023 సంవత్సరంలో గ్రామ సర్పంచ్ గా ఉన్న ఉమా ఆధ్వర్యంలో ఈ బస్సు షెల్టర్‌ను నిర్మించినట్లు గ్రామస్తులు బొల్లపల్లి రవీందర్ తెలిపారు. ఈ ప్లాస్టిక్ బాటిళ్లు భూమికి భారం కాకుండా ప్రయాణికులకు నీడనిచ్చే విధంగా తీర్చిదిద్దారు. ఈ బస్సు షెల్టర్ నిర్మాణానికి 1200 ఖాళీ ప్లాస్టిక్ బాటిళ్లను సేకరించారు. జె వైరు, ఇనుప పట్టిలను వినియోగించి ఈ బాటిళ్లతో బస్ షెల్టర్ నిర్మాణం చేశారు. షెల్టర్ చుట్టూ ఖాళీ బాటిళ్లలో గడ్డిపూల మొక్కలు పెంచి అందంగా అలంకరించారు. ఈ బస్సు షెల్టర్ నిర్మాణానికి రూ. 10 వేలు ఖర్చు చేశారు.

ఎంపీడీవో పల్లవికి వచ్చిన ఆలోచనతో ఎంతో ప్రయోజనం చేకూరిందని గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామంలో బస్సు షెల్టర్ రావడంతో పాటు పరోక్షంగా పర్యావరణ పరిరక్షణకు కూడా ఇది ఎంతో దోహదపడుతుందన్నారు. ఈ బస్‌స్టాండ్‌ను తిలకించేందుకు గతంలో వివిధ ప్రాంతాల నుంచి అనేకమంది ఇక్కడికి వచ్చి సెల్ఫీలు, ఫోటోలు తీసుకుని హర్షం వ్యక్తం చేసినట్లు తెలిపారు. ప్లాస్టిక్ గ్రామ రహితంగా తీర్చిదిద్దే దిశగా చేసిన ఈ ప్రయోగానికి మంచి గుర్తింపు వచ్చిందని ఈ గ్రామ పంచాయతీకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా అవార్డు లభించిందని వెల్లడించారు.

