Breast Cancer: టైట్ బ్రా వేసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందా..? మహిళలు తెలుసుకోవాల్సిన నిజం ఇదే!
టైట్ బ్రాలు రొమ్ముల్లో ఉండే లింఫాటిక్ ఫ్లో (శోషరస ప్రవాహం/Lymphatic flow)ను అడ్డుకుంటాయని, దీనివల్ల శరీరంలోని టాక్సిన్స్ అక్కడే పేరుకుపోయి క్యాన్సర్‌కు దారితీస్తాయని వాదన ఉంది. ఈ రోజుల్లో రొమ్ము క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దీనికి అనేక కారణాలు ఉండొచ్చు. అయితే టైట్‌గా ఉండే బ్రాలు (Tight bras), ముఖ్యంగా అండర్‌వైర్ బ్రాలు (Underwire bras) వేసుకుంటే రొమ్ము క్యాన్సర్ (Breast cancer) వస్తుందేమోనని చాలా ఏళ్లుగా మహిళలలో ఒక భయం ఉంది. ఈ మాటలు ట్రయల్ రూమ్స్‌లో, వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజ్‌లలో చక్కర్లు కొట్టాయి. కొన్ని పుస్తకాల్లోనూ దీని గురించి రాశారు. ఈ మాట నిజమే అనుకుని, చాలామంది బ్రా కలెక్షన్‌నే మార్చేయాలనుకుంటున్నారు. ఇంతకీ దీంట్లో నిజం ఎంత ఉందో చూద్దాం.
పుకారు మొదలైందిలా..
బ్రా, రొమ్ముక్యాన్సర్ లింక్, ఈ భయానికి అసలు కారణం 1995లో వచ్చిన ఒక పుస్తకం. సిడ్నీ రాస్ సింగర్, సోమా గ్రిస్మాయిజెర్ కలిసి రాసిన “డ్రెస్డ్ టు కిల్ (Dressed to Kill)” బుక్‌లో ఈ ప్రస్తావన తెచ్చారు. వారి ప్రకారం, టైట్ బ్రాలు రొమ్ముల్లో ఉండే లింఫాటిక్ ఫ్లో (శోషరస ప్రవాహం/Lymphatic flow)ను అడ్డుకుంటాయని, దీనివల్ల శరీరంలోని టాక్సిన్స్ అక్కడే పేరుకుపోయి క్యాన్సర్‌కు దారితీస్తాయని రాశారు. అయితే, ఈ మాట చెప్పడానికి వారి దగ్గర ఎలాంటి సైంటిఫిక్ ప్రూఫ్ లేదు. అది వాళ్లు ఊహించిన ఒక థియరీ మాత్రమే, కానీ నిజం కాదు. కేవలం సంచలనం కోసం రాసిన వార్తల వల్ల, ఈ అపోహ గత 30 ఏళ్లుగా పాపులర్ అయింది.
సైన్స్ ఏం చెబుతోంది?
అమెరికన్ క్యాన్సర్ సొసైటీ, నేషనల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ వంటి వరల్డ్ పాపులర్ హెల్త్ ఆర్గనైజేషన్స్… బ్రా స్టైల్, ఫిట్టింగ్ లేదా దాన్ని ఎంత టైట్‌గా ధరించినా, అది రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచదని స్పష్టం చేశాయి. 2014లో సియాటిల్‌లోని ఫ్రెడ్ హచిన్సన్ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ రీసెర్చర్లు ఒక స్టడీ నిర్వహించారు. క్యాన్సర్ ఉన్న, లేని 1,500 మందికి పైగా మహిళలను పరిశీలించి, వారి బ్రా వాడకం అలవాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆ స్టడీలో బ్రా రకం, దాని బిగుతు, రోజుకు ఎన్ని గంటలు వేసుకున్నారు అనే విషయాలకూ, క్యాన్సర్ వచ్చే ప్రమాదానికీ ఎలాంటి లింక్ లేదని స్పష్టమైంది.
టైట్ బ్రాలతో అసలు సమస్యలు
బ్రాల వల్ల క్యాన్సర్ రాదు సరే, కానీ సరైన సైజు బ్రా వేసుకోకపోతే ఇతర సమస్యలు తప్పవు. బ్రా బ్యాండ్ మరీ టైట్‌గా ఉంటే కదలికలకు ఇబ్బందిగా ఉండటమే కాకుండా, బ్లడ్ సర్కులేషన్ తగ్గుతుంది. భుజాలపై ఉండే పట్టీలు చర్మంలోకి గుచ్చుకుంటూ నరాలను చికాకు పెడతాయి. కప్పుల ఫిట్టింగ్ సరిగా లేకపోకపోతే మెడ, వీపు, భుజాల నొప్పులు రావచ్చు.
అండర్‌వైర్ బ్రాలను ఎక్కువసేపు వేసుకుంటే చర్మంపై రాపిడి జరిగి దద్దుర్లు రావచ్చు. ముఖ్యంగా ఎండాకాలంలో ఇది మరింత ఇబ్బంది పెడుతుంది. పాలిచ్చే తల్లులు లేదా బ్రెస్ట్ సర్జరీ నుంచి కోలుకుంటున్న వారు అండర్‌వైర్ బ్రాలు వాడకపోవడమే మంచిది. లేదంటే నొప్పి ఎక్కువ కావడం, పాల నాళాలు (Milk ducts) మూసుకుపోవడం లాంటివి జరగవచ్చు.
వైర్డ్ vs ప్యాడెడ్ బ్రాలు
వైర్డ్ బ్రా రొమ్ములకు మంచి షేప్, లిఫ్ట్, సపోర్ట్ ఇస్తుంది. ముఖ్యంగా పెద్ద సైజు రొమ్ములు ఉన్నవారికి, బిగుతైన డ్రెస్‌ల కింద పర్ఫెక్ట్ లుక్ కోసం వైర్డ్ బ్రాలు బాగా సూట్ అవుతాయి. కానీ, ఫిట్టింగ్ కరెక్ట్‌గా లేకపోతే వైర్ గుచ్చుకుని ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉంది. వైర్-ఫ్రీ/ప్యాడెడ్ బ్రాలు మెత్తగా, ఫ్లెక్సిబుల్‌గా ఉంటాయి. ఇంట్లో ఉన్నప్పుడు, రిలాక్స్‌గా ఉండే రోజుల్లో ఎక్కువ సౌకర్యాన్ని ఇస్తాయి. అయితే, వైర్డ్ బ్రాలతో పోలిస్తే ఇవి ఇచ్చే సపోర్ట్ కాస్త తక్కువ. దీనివల్ల కొందరిలో పోశ్చర్ మీద ప్రభావం పడొచ్చు.
బ్రా సెలక్షన్
మీకు కంఫర్ట్‌గా అనిపించే బ్రానే కొనాలి. ఒక మంచి బ్రా బిగుతుగా అనిపించకుండా మంచి సపోర్ట్‌ను అందిస్తుంది. బ్రా బ్యాండ్ కింద రెండు వేళ్లను ఫ్రీగా పెట్టలేకపోతే, ఆ బ్రా టైట్‌గా ఉందని అర్థం. మంచి షేప్, లిఫ్ట్ కావాలనుకున్నప్పుడు వైర్డ్ బ్రాలను.. హాయిగా, రిలాక్స్‌గా ఉండాలనుకున్నప్పుడు లేదా రొమ్ములు సెన్సిటివ్‌గా ఉన్నప్పుడు వైర్-ఫ్రీ బ్రాలను సెలెక్ట్ చేసుకోవాలి. రోజూ క్లీన్ బ్రా వేసుకుంటే స్కిన్ ఇన్‌ఫెక్షన్లు రావు.

