గుండు అంకుల్పై నాగార్జున ఫైర్.. బిగ్బాస్ నుంచి మాస్క్ మ్యాన్ ఔట్..?

బిగ్ బాస్ తొమ్మిదో సీజన్ మొదటి వారాంతంలోనే రచ్చ మొదలైంది. నాగార్జున కంటెస్టెంట్లకు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చేందుకు వచ్చేశారు. హరీష్ ని ‘గుండు అంకుల్’ అని ఇమ్మానుయేల్ అనడం వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. దీనిపై నాగ్ క్లాస్ పీకడంతో హౌస్ లో హీట్ పెరిగింది. హరీష్ ఆడవాళ్లపై చేసిన వ్యాఖ్యలకు షాక్ అయిన ఇంటి సభ్యులు, అతను తప్పుగా మాట్లాడాడని తేల్చేశారు. చివరకు హరీష్ క్షమాపణ చెప్పి, ఇంటి నుండి వెళ్ళిపోతానన్నాడు. ఏం జరిగిందో చూడాలంటే ఎపిసోడ్ చూడాల్సిందే!
ఇటీవల ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు సీజన్-9 రియాలిటీ షో.. అప్పుడే ఫస్ట్ వీకెండ్ లోకి వచ్చేసింది. ఎప్పటిలాగే శనివారం ఎపిసోడ్ లో హోస్ట్ అక్కినేని నాగార్జున కంటెస్టెంట్స్ ప్రోగ్రెస్ కార్డ్ పట్టుకొని వచ్చేసారు. బాక్సులు బద్దలైపోతాయంటూ సుత్తి పట్టుకొని వచ్చారు. ఇప్పటికే ఈరోజు ఎపిసోడ్ కి సంబంధించిన ఫస్ట్ ప్రోమోని రిలీజ్ చేశారు. మరికొన్ని నిమిషాల్లో ఫుల్ ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుందనగా.. లేటెస్టుగా సెకండ్ ప్రోమోని కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు.
అందరూ అనుకున్నట్లుగా శనివారం ఎపిసోడ్ మొత్తం ‘గుండు అంకుల్’ చుట్టూనే తిరిగినట్లు అర్థమవుతోంది. జబర్దస్త్ కమెడియన్ ఇమ్మానుయేల్, మాస్క్ మ్యాన్ హరీష్ మధ్య జరిగిన వివాదాన్నే నాగార్జున ప్రధానంగా ప్రస్తావించారు. హరీష్ ను ఇమ్మానుయేల్ సరదాగా గుండు అంకుల్ అని పిలవడం, దానికి హర్ట్ అయిన హరిత హరీష్ పెద్ద రాద్ధాంతం చేయడంతో హౌస్ మొత్తం హీటెక్కింది. ఇప్పుడు నాగ్ ఈ విషయాన్ని తీసుకొచ్చి డిస్కషన్ పెట్టారు. ఇద్దరిలో తప్పు ఎవరిది అనే దానిపై కంటెస్టెంట్స్ అభిప్రాయాలు తీసుకున్నారు.
”ఎంటర్టైన్మెంట్ పేరుతో ఏది పడితే అది మాట్లాడేస్తావా?” అంటూ నాగార్జున ప్రశ్నించగా.. క్యాజువల్ గా తీసుకుంటారనే అలా అన్నానని, కానీ ఆయన ఆ విధంగా తీసుకుంటారని అనుకోలేదని ఇమ్మానుయేల్ వివరణ ఇచ్చాడు. గుండు అంకుల్ అనే మాట సరదాగా అన్నాడని ఎంతమంది అనుకుంటున్నారు? అని అడగ్గా.. కంటెస్టెంట్స్ అందరూ ఇమ్మానుయేల్ కు మద్దతుగా చేతులెత్తారు. హౌస్ లో ఉన్న వారు మాత్రమే కాదు, బయట ఆడియన్స్ కూడా అలానే అనుకుంటున్నారని హరీష్ కు నాగ్ చెప్పారు.

