ఉచిత బస్సు పథకం లబ్దిదారులకు బిగ్ అప్డేట్, ఇక కొత్తగా…!!

ఏపీలో స్త్రీ శక్తి పథకానికి మంచి స్పందన కనిపిస్తోంది. పెద్ద సంఖ్యలో మహిళలు ఉచిత బస్సు ప్రయాణం కోసం వినియోగించుకుంటున్నారు. ప్రభుత్వం సైతం ఈ స్కీం అమలు ప్రతిష్ఠాత్మకం గా భావిస్తోంది. అమలులో భాగంగా వస్తున్న ఫీడ్ బ్యాక్ కు అనుగుణంగా ఆర్టీసీ అధికారులు మార్పులు తీసుకొస్తున్నారు. అదే విధంగా ప్రభుత్వం ఈ పథకం అమలు పైన నిరంతర సమీక్ష చేస్తోంది. ఎక్కడా ఎలాంటి ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా నిర్ణయాలు తీసుకుంటోంది. ఇదే సమయంలో ఈ పథకం పైన తాజాగా మంత్రి రాం ప్రసాద్ రెడ్డి కీలక అంశాలను వెల్లడించారు.
ఏపీలో మహిళల ఉచిత బస్సు పథకానికి అనూహ్య స్పందన వ్యక్తం అవుతోంది. బస్సులు మహిళల రద్దీతో కనిపిస్తున్నాయి. పలు దేవాలయాలకు సైతం మహిళా భక్తుల సంఖ్య పెరిగింది. తొలుత ఘాట్ రోడ్లకు ఈ పథకం అమలు చేయలేదు. తరువాత ప్రయాణీకుల నుంచి వచ్చిన అభ్యర్ధన మేరకు ఘాట్ రోడ్లలో వెళ్లే బస్సుల్లోనూ అనుమతి ఇచ్చారు. కాగా, కూర్చొని ప్రయణానికి మాత్రమే ఈ రూట్ లో బస్సుల్లో అనుమతిస్తున్నారు. ఇక.. ఉచిత పథకం అమలు చేసే బస్సులను ప్రత్యేకం గా గుర్తించేలా చూడాలనే అభ్యర్ధనలు వచ్చాయి. దీనికి అనుగుణంగా బస్సుల కేటాయింపు తో పాటుగా సులువుగా గుర్తించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ స్కీం కింద నడిచే ప్రతీ బస్సుకు జీపీఎస్ విధానం అమలు చేస్తున్నారు. కాగా, ఈ పథకం అమలు ద్వారా ఇతరులకు సమస్యలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
కాగా, ఈ బస్సుల్లో ఇప్పటికే బస్ పాస్ లు తీసుకున్న మహిళా ఉద్యోగులు, విద్యార్థినులకు సైతం అనుమతిస్తున్నారు. ప్రస్తుత బస్ పాస్ కాలపరిమితి ముగిసిన తరువాత ఇక వారు కొత్తగా పాస్ లు తీసుకోవాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. ఈ పథకం అమలు పైన రవాణా మంత్రి రాం ప్రసాద్ రెడ్డి కీలక అంశాలను వెల్లడించారు. ఆగస్టు 15న ప్రారంభించిన ఈ పథకం నెల రోజులు పూర్తి చేసుకుంది. నెల రోజుల కాలంలో 3.17 కోట్ల మంది ప్రయాణీకులు ఈ పథకం సద్వినియోగం చేసుకున్నట్లు వివరించారు. రూ 118 కోట్ల మేర లబ్ది వారికి చేకూరిందని లెక్కలు వివరించారు. దీని ద్వారా జీరో టికెట్ ద్వారా ఆర్టీసీ ఇచ్చే లెక్కల ఆధారంగా ప్రభుత్వం ఆ మొత్తాన్ని రీ యంబర్స్ చేయనుంది. త్వరలో ప్రభుత్వం ఎలక్ట్రికల్ బస్సులు తీసుకురానుంది. ఆ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

