
హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గత నెల(ఆగస్టు) 27వ తేదీన ప్రారంభమైన వినాయక ఉత్సవాలు నేటితో ముగిసింది. తొమ్మిది రోజులు ఘనంగా పూజలు అందుకున్న గణనాథులు నేడు అంగరంగా వైభవంగా ఊరేగింపుతో గంగమ్మ ఒడికి చేరుకుంటున్నారు. అయితే.. గణేష్ ఉత్సవాలు అనగానే గుర్తొచ్చే వాటిలో లడ్డూ వేలం ఒకటి. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని వినాయకుల విషయానికొస్తే.. బాలాపూర్ గణేషుడు, ఖైరతాబాద్ బడా గణేష్ చాలా ఫేమస్. ఇక, బాలాపూర్ గణేషుడి లడ్డూ ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఏటా రికార్డు స్థాయిలో ధర పలుకుతుంది.
ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు 1954లో కేవలం ఒక అడుగు ఎత్తు విగ్రహంతో మొదలయ్యాయి. విగ్రహం ఎత్తును పెంచుతూ వచ్చారు. ఈ ఏడాది(2025)లో శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి పేరుతో 69 అడుగుల ఎత్తుతో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌కు బదులుగా పూర్తిగా మట్టితో తయారు చేసినట్లు ఉత్సవ కమిటీ పేర్కొంది.
ఇదిలా ఉంటే.. ఖైరతాబాద్ బడా గణేషుడి లడ్డూ గురించి ఓ ఆసక్తికరమైన విషయం తెలుసుకుందాం. ఈ లడ్డూ దాని పరిమాణానికి, రుచికి చాలా ప్రసిద్ధి చెందింది. దీనిని కొన్ని టన్నుల బరువు తో తయారు చేస్తారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద లడ్డూల్లో ఒకటిగా నిలిచింది. కానీ, మహా గణపతి లడ్డూను వేలం వేయరు. ఎందుకంటే.. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ కొన్ని సంప్రదాయాలను పాటిస్తుంది. అందులో లడ్డూను వేలం వేయకూడదనే నియమం కూడా ఉంది. ఇక్కడ లడ్డూను ప్రసాదంగా భావిస్తారు. దానిని వ్యాపార వస్తువుగా పరిగణించకుండా అందరికీ పంచి పెట్టడం ద్వారా దాని పవిత్రతను కాపాడాలని భావిస్తారు. లడ్డూ కోసం వేలం పాట పెట్టడం భక్తుల మనోభవాలను దెబ్బతీస్తుందని కమిటీ భావిస్తోంది. ఎందుకంటే లడ్డూనూ ప్రసాదంగా స్వీకరించాలని భక్తులు కోరుకుంటారు.
