సెకండ్ హ్యాండ్‌లో బైక్, కారు కొంటున్నారా.. ఈ తప్పు చేయొద్దు, కేసుల్లో ఇరుక్కుంటారు

AP Second Hand Vehicles Buying Tips:సెకండ్ హ్యాండ్ వాహనాలు కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్ధిక ఇబ్బందులతో పాత బండ్లు కొని, ఆర్సీ పేరు మార్చకపోవడం, ఇన్సూరెన్స్ లేకపోవడం వంటి చిన్న పొరపాట్లతో చాలామంది పెద్ద సమస్యల్లో చిక్కుకుంటున్నారు. పండగల సీజన్‌లో మోసపోకుండా ఉండాలంటే, వాహనం రికార్డులు, ఫైనాన్స్ క్లియరెన్స్ సరిచూసి, మీ పేరు మీదకు మార్చుకోవడం మర్చిపోవద్దు. లేదంటే, ఇతరులు చేసిన తప్పులకు మీరే బాధ్యులు కావాల్సి వస్తుంది.
హైలైట్:
- సెకండ్ హ్యాండ్ వాహనాల విషయంలో జాగ్రత్త
- ఈ తప్పులు చేయొద్దు.. ఇబ్బందులు పడొద్దు
- చిన్న పొరపాట్లతో చాలామంది పెద్ద సమస్యలు
సాధారణంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారు ఆర్థిక ఇబ్బందులతో సెకండ్ హ్యాండ్‌లో వాహనాలు, బైక్ కొనుగోలు చేస్తుంటారు. ఇలా పాత వాహనాలు కొనుగోలు చేసి చాలామంది నష్టపోయారు. చిన్న, చిన్న పొరపాట్లతో కొత్త సమస్యల్లో చిక్కుకుపోతున్నారు. అందుకే సెకండ్ హ్యాండ్ బైక్‌లు, వాహనాలు కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని
పోలీసులు, రవాణాశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.ఓ వ్యక్తి స్కూటీ కొనుగోలు చేసి సరిగా నడవకపోవడంతో వెంటనే అమ్మేశాడు. అయితే RC పేరు మార్చకపోవడంతో ఆ స్కూటీ చేతులు దాటి మూడో వ్యక్తి దగ్గరకు వెళ్లింది. అతడు ప్రమాదానికి గురికాగా.. కేసు మాత్రం మొదట కొనుగోలు చేసిన వ్యక్తిపై నమోదైంది. మరొకరు కూడా సెకండ్ హ్యాండ్‌లో బైక్ కొనుగోలు చేయగా.. అతడు ఇన్స్యూరెన్స్ చేయించలేదు, ఆర్సీ కూడా ఆయన పేరు మీదకు మార్చలేదు. ఆ తర్వాత ప్రమాదం జరిగింది.. దీంతో కేసు తీవ్రత పెరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలే ఉన్నాయి. ఇప్పుడు పండగల సీజన్ నడుస్తుంది.. దసరా, దీపావళికి కూడా సెకండ్ హ్యాండ్ వాహనాలు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు.

