పంజాబ్ నుంచి కేరళ దాకా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో కొన్ని చోట్ల వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో తీవ్ర ఎండలు నమోదయ్యాయి.
అమరావతి, విశాఖపట్నం, మే 2(ఆంధ్రజ్యోతి): పంజాబ్ నుంచి మధ్యప్రదేశ్, విదర్భ, మరట్వాడ, కర్ణాటక మీదుగా కేరళ వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. అదే సమయంలో తేమ గాలులు బంగాళాఖాతం నుంచి కోస్తా మీదుగా మధ్య భారతం దిశగా వీస్తున్నాయి. వీటి ప్రభావంతో శుక్రవారం కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షం కురిసింది. మిగిలినచోట్ల ఎండ తీవ్రత, ఉక్కపోత కొనసాగాయి. ఇక, రాష్ట్రవ్యాప్తంగా శనివారం పగటి ఉష్ణోగ్రతలు 41-42.5 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కొన్ని చోట్ల ఎండలు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. కాగా, శుక్రవారం కడప జిల్లా కమలాపురంలో 42, నంద్యాల జిల్లా గుల్లదుర్తిలో 41.7, తిరుపతి జిల్లా వెంకటగిరిలో 41.3, నెల్లూరు జిల్లా రేపూరులో 41 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
