అరెస్టుల వేళ.. జగన్ వరుస భేటీలు

YS Jagan: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. వరుస భేటీలను నిర్వహిస్తోన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే దిశగా కార్యాచరణకు సిద్ధమౌతున్నారు.
జగన్ 2.0 అంటూ గతంలో ప్రకటించారు జగన్. దీనికి అనుగుణంగా అడుగులు వేస్తోన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంటోన్నారు. క్యాడర్లో ఊపు తెచ్చే నిర్ణయాలను తీసుకుంటోన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి వేగంగా కోలుకున్న జగన్..నూతనోత్తేజాన్ని నింపేలా 2.0ను సిద్ధం చేస్తోన్నారు.
ఇప్పటికే పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ, జిల్లా అధ్యక్షులతో సమావేశం అయ్యారాయన. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై దిశానిర్దేశం చేశారు. చంద్రబాబు- పవన్ కల్యాణ్ ప్రభుత్వ వైఫల్యాలు, సూపర్ సిక్స్ హామీల అమలులో విఫలం కావడం వంటి అంశాలను మరింత ఉధృతంగా జనంలోకి తీసుకెళ్లాలంటూ సూచించారు అప్పట్లో. అదే సమయంలో ఏపీ మద్యం కుంభకోణం కేసులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. ఈ కేసులో ఆరోపణలు, విచారణను ఎదుర్కొంటోన్న మాజీ ఐఎఎస్ అధికారి కే ధనంజయ రెడ్డి, పీ కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ధనంజయ రెడ్డి సీఎంఓ కార్యదర్శిగా, కృష్ణమోహన్ రెడ్డి జగన్ కు ఓఎస్డీగా పని చేశారు.

News by : V.L
Amidst arrests.. Jagan holds series of meetings
