Amarnath Yatra 2025: అమర్నాథ్ యాత్ర ప్రారంభం.. భక్తులకు భారీ భద్రతా ఏర్పాట్లు

Amarnath Yatra 2025: హిందూ ఆచారాల ప్రకారం ఇవాళ చాలా మంచి రోజు. ఇవాళ అష్టమి గురువారం. అందుకే ఇవాళ అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది. తొలి బ్యాచ్ బయలుదేరింది. దీనికి సంబంధించి అప్డేట్స్ తెలుసుకుందాం.
జమ్మూకాశ్మీర్‌లో పవిత్ర అమర్ నాథ్ యాత్ర ఇవాళ ప్రారంభమైంది. ప్రతీ సంవత్సరం దాదాపు ఇదే సమయంలో.. అమర్నాథ్ గుహలో.. సహజ సిద్ధంగా ఏర్పడే శివ లింగాన్ని దర్శించుకునేందుకు భక్తులు బ్యాచ్‌ల రూపంలో వెళ్లడం ఆనవాయితీ. ఈ సంవత్సరం ఈ యాత్రను జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా.. జమ్మూలోని భగవతి నగర్ బేస్ క్యాంప్ నుంచి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. తొలి విడతలో 5,880 మంది యాత్రికులు జమ్మూ నుంచి బయలుదేరారు. ఈ యాత్ర 38 రోజుల పాటు జరుగునుంది. ఆ తర్వాత శివలింగం కరిగిపోతుంది. అందువల్ల ఆగస్టు 9 నాడు యాత్ర ముగుస్తుంది. ఈ సంవత్సరం యాత్ర కోసం 3.5 లక్షల మంది భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. పహల్గామ్లో ఈ మధ్య ఉగ్ర దాడి జరిగినా.. యాత్రకు భారీ రెస్పాన్స్ రావడం మంచి విషయం.
యాత్రకు 2 మార్గాలు:
ఈ యాత్ర పహల్గామ్, బాల్తాల్ అనే రెండు మార్గాల ద్వారా సాగుతుంది. పహల్గామ్ మార్గం 48 కిలోమీటర్ల దూరం ఉంటుంది. బాల్తాల్ మార్గం 14 కిలోమీటర్ల దూరంతో ఉంటుంది. కానీ.. ఇది చాలా ఎక్కువ ఎత్తుతో ఉంటుంది. ఇది చిన్న మార్గమే కానీ.. కష్టమైన మార్గంగా ఉంది. ఈ రెండు మార్గాల్లోనూ యాత్రికులకు సౌకర్యవంతమైన ఏర్పాట్లు చేశారు. ఇటీవలి పహల్గామ్ ఉగ్రవాద దాడి, అలాగే కొన్ని ఉగ్రవాదుల హెచ్చరికల కారణంగా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. RFID ట్రాకింగ్, వైద్య సహాయం, మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించారు. నిరంతరం యాత్రికుల్ని గమనిస్తూ, వారికి ఆపద రాకుండా ఉండేలా అధికారులు అన్ని చర్యలూ తీసుకున్నారు.
పురాణ ప్రాసస్థ్యం:
ఈ యాత్రలో భక్తులు బాబా బర్ఫానీ (హిమలింగం)ని దర్శంచుకుంటారు. ఈ గుహలో శివుడు, పార్వతీ దేవికి అమరత్వ రహస్యాలను వివరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ యాత్ర హిందూ భక్తులకు అత్యంత పవిత్రమైనదిగా మారింది. తమ జీవితంలో ఒక్కసారైనా మంచు లింగాన్ని దర్శించుకోవాలి అని భక్తులు కోరుకుంటారు. యాత్రకు ముందు జమ్మూలోని సరస్వతి ధామ్‌లో టోకెన్ వితరణ కేంద్రం ప్రారంభించారు. ఇక్కడ దేశవిదేశాల నుంచి వచ్చిన భక్తులు.. భారీ సంఖ్యలో రిజిస్ట్రేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. రిజిస్ట్రేషన్ తర్వాత ఇక్కడ టోకెన్ ఇస్తారు. అది టికెట్ లాగా ఉపయోగపడుతుంది.
