Alum Benefits: దంతాలు, చర్మ సమస్యలకు పటికతో చెక్ పెట్టండి.. ఎలా ఉపయోగించాలంటే

పటిక ప్రతి ఇంట్లో సర్వసాధారణంగా కనిపిస్తుంది. ముఖ్యంగా వర్షాకాలంలో నీటిని శుభ్రం చేసుకోవడానికి దీనిని ఉపయోగిస్తారు. మరికొంతమంది గాయాలకు ప్రాధమిక చికిత్సగా కూడా ఉపయోగిస్తారు. అయితే పటిక ఒక క్రిమినాశక, రక్తస్రావ నివారిణి మాత్రమే కాదు సౌందర్య సంరక్షణ లక్షణాలను కూడా కలిగి ఉంది. ఇది ముఖం మీద మొటిమలు, మచ్చలు, నోటి దుర్వాసన, పంటి నొప్పులు , చిన్న గాయాలు వంటి సమస్యల నివారణకు ప్రభావవంతంగా పని చేస్తుంది.
పటిక ప్రతి ఇంట్లో ఉంటుంది. అయితే దీనిలోని ఔషధ గుణాల గురించి మాత్రం కొంతమందికే తెలుసు. తక్కువ ధర అని చిన్న చూపు చూస్తారు. పటిక రసాయనిక నామం పొటాషియం అల్యూమినియం సల్ఫేట్. ఈ చిన్న తెల్లటి రాళ్ళు నిజంగా మాయాజాలం. శరీరం మీద కోత లేదా గాయం ఏర్పడితే.. పటిక నీటితో రుద్దడం వల్ల తక్షణమే క్రిమినాశక మందుగా పనిచేస్తుంది. గాయపడిన ప్రాంతాన్ని క్రిమిసంహారక చేస్తుంది. ఇది ఆరోగ్య సంరక్షణ నుంచి అందం వరకు ప్రతిదానికీ ఉపయోగించవచ్చు. ఈ రోజు పటిక వలన కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం..
మొటిమలకు పటిక వాడకం: యుక్తవయస్సుకు ముందు.. తరువాత యువత మొటిమలతో బాధపడుతున్నారు. మొటిమల సమస్య కొంత మంది చాలా తీవ్రంగా కూడా ఉంటుంది. మొటిమలు నయం కానప్పుడు.. చాలా మంది రకరకాల రసాయన క్రీములను ఆశ్రయిస్తారు. వాటికి బదులుగా.. పటికను ఉపయోగించడం వల్ల మొటిమలు తొలగిపోవడమే కాదు ముఖం రంగు కూడా మెరుగుపడుతుంది.
ముఖం మీద మచ్చలను తొలగించడానికి పటిక: పటిక నీటిని ఉపయోగించడం వల్ల చర్మంలోని మచ్చలు తొలగిపోయి, చర్మం కాంతివంతంగా మారుతుంది. దీనిని ఉపయోగించడం సులభం. రసాయనక క్రీమ్ కంటే చాలా మంచిది. కొద్ది మొత్తంలో పటికను తీసుకుని ఒక మగ్గులో వేయండి. అది పూర్తిగా కరిగిన తర్వాత.. ఆ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి.
స్నానం చేసే నీటిలో పటిక: స్నానం చేసే నీటిలో పటిక ముక్క వేసుకుని కరిగిన తర్వాత ఆ నీటితో స్నానం చేయండి. ఇలా రోజూ పటిక కలిపిన నీటిని స్నానం చేయడం వలన వదులుగా ఉండే చర్మం బిగుతుగా మారుతుంది. పటిక, రోజ్ వాటర్ కలిపి కూడా ఉపయోగించవచ్చు. వారానికి రెండు లేదా మూడు సార్లు పటిక రోజ వాటర్ కలిపిన నీటితో స్నానం చేయవచ్చు. లేదా ముఖం శుభ్రం చేసుకోవచ్చు. ఎవరైనా ముఖం మీద అవాంఛిత వెంట్రుకలతో ఇబ్బంది పడుతుంటే.. పటిక మంచి సహాయకారి. దీని కోసం ఒక టీస్పూన్ పటిక పొడిని రోజ్ వాటర్ తో కలిపి పేస్ట్ లా చేసి జుట్టు పెరిగిన ప్రదేశాలకు అప్లై చేయండి. దీని ప్రభావం కొన్ని రోజుల్లో కనిపిస్తుంది.
పటికలో అనేక లక్షణాలు: పటికలో ఆస్ట్రింజెంట్ లక్షణాలు ఉన్నాయి. ఇది రంధ్రాలను బిగుతుగా చేస్తుంది. నిజానికి చర్మం మీద రంధ్రాలు పెద్దవి అయినప్పుడు మొటిమల ప్రమాదాన్ని పెంచుతాయి. పటికను పేస్ట్‌గా చేసుకుని ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయడం వలన మొటిమలు నయమవుతాయి. అయితే ఈ చిట్కాను ఎక్కువ సార్లు ఉపయోగించ కూడదు.
నోటి దుర్వాసనను వదిలించుకోవడానికి పటిక: పటిక మౌత్ వాష్ కంటే కూడా చాలా మంచిది. ఇది దుర్వాసనను తొలగించడమే కాకుండా నోటిలోని బ్యాక్టీరియాను కూడా నియంత్రిస్తుంది. ఒక చిన్న పటిక ముక్కను గోరువెచ్చని నీటిలో నానబెట్టి ఆ నీటితో నోరుని శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం వలన దంతాల మీద ఉన్న పాచి(ఫలకం) తొలగమే కాదు లాలాజలంలోని బ్యాక్టీరియాను కూడా చంపుతుంది. ఇది నోటి దుర్వాసనను తొలగిస్తుంది.
పంటి నొప్పికి ఉపశమనం: పటిక నీటిని ఉదయం, సాయంత్రం పుక్కిలించడానికి ఉపయోగించవచ్చు. ఇలా పుక్కిలించడం వల్ల గొంతు నొప్పి . పంటి నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే పటిక నీరు మీ గొంతులోకి దిగకుండా జాగ్రత్త వహించండి.
గాయాలను నయం చేయడానికి పటిక: పిల్లలు, పెద్దలు తరచుగా చర్మంపై గాయాలు లేదా కోతలకు గురవుతారు. అటువంటి పరిస్థితిలో ఇంట్లో పటిక ఉంటే.. దీని కంటే సురక్షితమైన పరిష్కారం మరొకటి లేదు. పటికలో ప్రత్యేకమైన గాయం నయం చేసే లక్షణం ఉంది. అందువల్ల చిన్న గాయాలకు లేదా చిన్న గాయాలను శుభ్రం చేయడానికి.. గోరువెచ్చని నీటిలో పటికను కలిపి ఆ నీటిలో కాటన్ క్లాత్ ముంచి శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన గాయాలు త్వరగా నయమవుతాయి.

