ఏ కథ మీద ఎవరి పేరు రాసి వుంటుందో. ఇండస్ట్రీలో అలాగే వుంటుంది. ఒక్కో కథ ఫస్ట్ సిటింగ్ లో హీరోను తెచ్చేసుకుంటుంది. ఒక్కో కథ ఇద్దరు ముగ్గురు హీరోల దగ్గర తిరిగి, ఆఖరికి ఎక్కడో సెటిల్ అవుతుంది. ఒక్కోసారి వదులుకున్నవాళ్లు అరెరే అనవసరంగా వదిలేసామే అనుకుంటారు. ఒక్కోసారి వదిలేయడం మంచిదే అయింది అనుకుంటారు. కథల విషయాలు ఇలా వుంటాయి.
ఇంతకీ విషయం ఏమిటంటే అక్కినేని బ్రదర్స్ రెండు సినిమాలు చేస్తున్నారు. నాగ్ చైతన్య ఓ సినిమాను మిస్టిక్ థ్రిల్లర్ జానర్ లో చేస్తున్నారు. 100 కోట్ల భారీ సినిమా ఇది. భోగవిల్లి బాపినీడు నిర్మాత. కార్తీక్ దండు దర్శకుడు. ఈ కథ ముందుగా రామ్ పోతినేని దగ్గరకు వెళ్లినట్లు తెలుస్తోంది. కానీ ఎందుకో అది తనకు నప్పదనో, లేక అదే టైమ్ లో వచ్చిన మరో కథ ఓకె చేయాల్సి రావడం వల్లనో ఈ ప్రాజెక్ట్ ను వదులుకున్నాడు రామ్.
అక్కినేని అఖిల్ ఓ సినిమా చేస్తున్నాడు. లెనిన్ అనే టైటిల్ లో తయారవుతున్న ఈ సినిమా రంగస్థలం టైపు జానర్. పక్కా రూటేడ్ కథ అన్న మాట. ఎన్నాళ్ల నుంచో వార్తల్లో వున్న బలగం వేణు యల్లమ్మ లాంటి ఛాయలు కూడా వుంటాయని తెలుస్తోంది. ఈ కథ కూడా ముందుగా రామ్ దగ్గరకు వెళ్లినట్లు తెలుస్తోంది. కానీ తనకు అలాంటి కథ నప్పదనే ఆలోచనతో రామ్ నో అన్నట్లు తెలుస్తోంది.
మొత్తానికి అక్కినేని బ్రదర్స్ దగ్గరకు చేరాయి ఈ రెండు కథలూ. వారికి ప్లస్ అవుతాయనే నమ్మకం అటు హీరోల్లోనూ, మేకర్లలోనూ వుంది.
