- చిన్నటేకూరు పరిధిలోని చెట్లమల్లాపురం వద్ద గతేడాది అక్టోబరు 24న వీకావేరి బస్సు దగ్ధమై 19 మంది మృత్యువాత పడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో పెద్దఎత్తున చరవాణులు దొరకడంతోపాటు గ్యాస్ సిలిండర్ కూడా ఉన్నట్లు గుర్తించారు.
- శిరివెళ్లమెట్ట వద్ద ఈనెల 22న జరిగిన ప్రమాదంలో బస్సు నామరూపాల్లేకుండా కాలిపోయింది. టైరు పేలిపోవడంతో బస్సు అదుపు తప్పి విభాగిని పైకి దూసుకెళ్లి ఎదురు రోడ్డులో వెళ్తున్న లారీని ఢీకొని ఆహుతైంది.
ఉమ్మడి జిల్లాలో 40, 44వ నంబరు జాతీయ రహదారులు వెళుతున్నాయి. ఆయా మార్గాల్లో ప్రతిరోజూ పెద్దసంఖ్యలో ప్రైవేటు బస్సులు నడుస్తుంటాయి. 120 కి.మీ.కుపైగా వేగంతో వెళుతుంటాయి. గతేడాది అక్టోబరులో చెట్లమల్లాపురం, ఈ ఏడాది జనవరిలో శిరివెళ్లమెట్ట వద్ద బస్సు ప్రమాదాలు జరిగి పలువురు సజీవ దహనమయ్యారు. ఈ నేపథ్యంలో అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సి ఉండగా.. పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి.
సమీక్షలతో సరి..
- ఉమ్మడి జిల్లాలో ప్రతి మూడు నెలలకోసారి రహదారి భద్రతపై సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. వివిధ పనులపై నివేదికలు అందజేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పనులు కానరావడం లేదు. ప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
- ఏటా జనవరి 1 నుంచి 31వ తేదీ వరకు రహదారి భద్రతా మాసోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రమాదాల నివారణపై అవగాహన సదస్సులు, ర్యాలీలు జరుపుతున్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలను మాత్రం పట్టించుకోవడం లేదు.
- బస్సుల వేగాన్ని అంచనా వేసేందుకు 2008లో ఉమ్మడి కర్నూలు జిల్లాకు రెండు స్పీడ్ గన్ యంత్రాలు తెప్పించారు. ఇవి మూడు నెలలు మాత్రమే పనిచేశాయి. సాంకేతిక సమస్యలు రావడంతో వాటిని పక్కకు పడేశారు.
లోపాలున్నా పట్టించుకోరు
- బస్సు బయలుదేరే ముందు పూర్తిగా తనిఖీ చేయాల్సి ఉంది. కానీ పలు లోపాలున్నట్లు రోడ్డుపైకి తీసుకొస్తున్నారు. వీకావేరీ బస్సు.. గతంలో పలుచోట్ల నిబంధనలు ఉల్లంఘించినట్లు అధికారుల దర్యాప్తులో వెలుగుచూసింది.
- అత్యవసర ద్వారాలు తెరిచే అవకాశం లేకుండా కొన్ని బస్సుల్లో సీట్లు, స్లీపర్లు అడ్డుగా ఉంటున్నాయి.
- బస్సు కింది భాగంలో ప్రయాణికుల లగేజీ భద్రపరిచేందుకు కంపార్ట్‌మెంట్లు ఉంటాయి. వీటిల్లో నిషేధిత పదార్థాలతో పలు పార్సిళ్లను సైతం రవాణా చేస్తున్నారు.
ఇష్టారాజ్యంగా డిజైన్ల మార్పు
- జాతీయ భద్రత ప్రమాణాలకు లోబడి బస్సును డిజైన్ చేయాలి. బస్సు తయారీ సంస్థలు ఆమేరకు తయారుచేస్తున్నా ట్రావెల్స్ యాజమాన్యాలు ఇష్టమొచ్చినట్లు మార్చేస్తున్నాయి.
- ప్రభుత్వ బస్సులకు స్పీడ్ లాక్ పరికరాలు అమరుస్తున్నారు. ఫలితంగా డ్రైవర్లు మితిమీరిన వేగంతో వెళ్లేందుకు అవకాశం ఉండదు. ప్రైవేటు బస్సుల్లో ఇవి కానరావడం లేదు.

