రైలు ప్రయాణాల్లో పరిశుభ్రత సమస్యను మరింత క్రమంగా, పారదర్శకంగా పరిష్కరించడానికి సన్నాహాలు చేస్తున్నట్టు వెల్లడించారు.
సాధారణంగా రైల్లో ప్రయాణించే సమయంలో చాలామంది ఇబ్బంది పడేది టాయిలెట్ల పరిశుభ్రత గురించే. రైల్వే ప్రయాణికుల్లో ఎక్కువ ఫిర్యాదులు వచ్చేది కూడా ఈ అంశంపైనే. ఈ సమస్య పరిష్కారం కోసం భారతీయ రైల్వే సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)ని ఉపయోగించనుంది. దీనికి సంబంధించి ఇటీవల కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. రైలు ప్రయాణాల్లో పరిశుభ్రత సమస్యను మరింత క్రమంగా, పారదర్శకంగా పరిష్కరించడానికి సన్నాహాలు చేస్తున్నట్టు వెల్లడించారు. దీని గురించి చీఫ్ ప్రాజెక్టు ఇంజినీర్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఇక నుంచి రైళ్లలో పరిశుభ్రతను ఏఐ పర్యవేక్షిస్తుంది. తొలి దశలో దేశవ్యాప్తంగా 100 రైళ్లలో పైలట్ ప్రాజెక్టుగా పనిని ప్రారంభించామని స్పష్టం చేశారు.
దీనికోసం రైల్వే సిబ్బంది ప్రత్యేక యాప్ ఉపయోగిస్తారు. వారి డ్యూటీ సమయాన్ని బట్టి వివరాలను అందులో ఎంటర్ చేశాక, రైళ్లలో క్లీనింగ్ ప్రారంభించే ముందు, తర్వాత టాయిలెట్ ఫొటోలను యాప్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఈ రెండు ఫొటోలను ఏఐ సమీక్షించి సేవల నాణ్యతను నిర్ధారిస్తుంది. పరిశుభ్రతలో ఏమైనా లోటుపాట్లు ఉంటే, సిబ్బందికి తగిన సమాచారం అందుతుంది. కొన్ని సందర్భాల్లో సిబ్బందిపై జరిమానాలు కూడా ఉంటాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. సాధారణంగా ఏసీ ఫస్ట్ క్లాస్ కోచ్‌లలో కనిపించే పరిశుభ్రత ఇప్పుడు జనరల్ క్లాస్ కోచ్‌లలో కూడా లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.

