దీని ద్వారా భారత్‌ను ఏఐ రంగంలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిపే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.
దేశీయ బిలియనీర్ గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ ఏఐ రంగంలో భారీ పెట్టుబడులకు సిద్ధమవుతోంది. 2035 నాటికి దేశవ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన ఆధారిత కృత్రిమ మేధస్సు (ఏఐ)-రెడీ డేటా సెంటర్లను నిర్మించడానికి అదానీ గ్రూప్ 100 బిలియన్ డాలర్ల(రూ. 9 లక్షల కోట్ల) పెట్టుబడి పెట్టనున్నట్టు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. దీని ద్వారా భారత్‌ను ఏఐ రంగంలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిపే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ఈ పెట్టుబడులతో సర్వర్ తయారీ, విద్యుత్ పరికరాలు, క్లౌడ్ సేవలు వంటి సంబంధిత పరిశ్రమలలో అదనంగా మరో 150 బిలియన్ డాలర్లకు దారితీయవచ్చు. మొత్తంగా, రాబోయే దశాబ్ద కాలంలో దేశీయంగా 250 బిలియన్ డాలర్ల ఏఐ మౌలిక సదుపాయాల ఎకోసిస్టమ్ సృష్టి జరుగుతుందని అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ చెప్పారు.
ప్రస్తుతం ప్రపంచం పారిశ్రామిక విప్లవానికి మించిన స్పీడ్‌తో ఇంటెలిజెన్స్ రివల్యూషన్‌లో పయనిస్తోందన్నారు. కంప్యూటర్, ఎనర్జీని సమర్థవంతంగా సమతుల్యం చేయగల దేశాలే ఏఐ యుగాన్ని లీడ్ చేస్తాయని తెలిపారు. భారత్ ఇందుకు సిద్ధంగా ఉందని, అందులో భాగంగానే అదానీ గ్రూప్ నుంచి డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో పటిష్టమైన పునాదులను సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించారు. ఏఐ యుగంలో భారత్ కస్టమర్‌లా కాకుండా, ఇంటెలిజెన్స్ ఎగుమతిదారు, బిల్డర్‌గా ఉంటుందని, దీనికి అదానీ గ్రూప్ భాగస్వామ్యం అందించడం సంతోషంగా ఉందని గౌతమ్ అదానీ పేర్కొన్నారు.

