Aadhaar-PAN Link: నేటి నుంచి పాన్ కార్డుకు ఆధార్ తప్పనిసరి.. మీ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి?

Aadhaar-PAN Link: 2025 జూలై 1 నుంచి కొత్త పాన్ కార్డు కోసం ఆధార్ తప్పనిసరి. పాత పాన్ హోల్డర్లు డిసెంబర్ 31, 2025 లోపు ఆధార్ లింక్ చేయాలి. లింక్ చేయకపోతే పాన్ చెల్లుబాటు కాదు.
Aadhaar-PAN Link: 2025 జూలై 1వ తేదీ నుంచి, కొత్త పాన్ (Permanent Account Number) కార్డు కోసం దరఖాస్తు చేసుకునే ప్రతి వ్యక్తికి ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. ఇప్పటివరకు వ్యక్తులు తమ పేరు లేదా పుట్టిన తేదీ ఆధారంగా ఇతర గుర్తింపు పత్రాలతో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఈ ప్రక్రియలో మార్పులు చోటుచేసుకున్నాయి.
CBDT కొత్త నిబంధనలు ఎందుకు తీసుకొచ్చింది?
పన్నుల వ్యవస్థలో పారదర్శకత కోసం మరియు దుర్వినియోగాలను నివారించేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ఆధార్ ఆధారిత ధృవీకరణను తప్పనిసరి చేసింది. దీనివల్ల ఒకే వ్యక్తి బహుళ పాన్ కార్డులు తీసుకోవడం, లేదా ఇతరుల పాన్‌ను దుర్వినియోగం చేయడం లాంటి చర్యలకు అడ్డుకట్ట పడుతుంది.
పాత పాన్ హోల్డర్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఇప్పటికే పాన్ కార్డు కలిగినవారు తమ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయాల్సిన అవసరం ఉంది. ఇందుకు డిసెంబర్ 31, 2025 వరకు గడువు ఉంది. ఈ గడువులోపు లింక్ చేయనివ్వకపోతే, ఆ పాన్ కార్డు చెల్లుబాటు కాకుండా తయారవుతుంది. ఇది బ్యాంకింగ్, ఇన్వెస్ట్మెంట్, ఇన్కమ్ ట్యాక్స్ వంటి అనేక ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావం చూపుతుంది.
ఆధార్ తప్పనిసరిగా ఎందుకు చేశారో తెలుసా?
ఇటీవల ఆదాయపు పన్ను శాఖ అనేక మోసపూరిత చర్యలను గుర్తించింది. ఉదాహరణకు, కొందరు వ్యక్తులు వేర్వేరు పాన్ కార్డులు తీసుకొని పన్నుల ఎగవేతకు పాల్పడ్డారు. అలాగే, బహుళ పాన్ కార్డులను ఉపయోగించి మోసపూరితంగా GST రిజిస్ట్రేషన్లు కూడా చేశారు. ఇలాంటి అక్రమాలను అరికట్టేందుకు ఆధార్ ఆధారిత లింకింగ్ విధానం తెచ్చారు. 2024 మార్చి వరకు భారత్‌లో ఉన్న 74 కోట్ల పాన్ హోల్డర్లలో, దాదాపు 60 కోట్ల మంది తమ ఆధార్ నంబర్‌ను పాన్‌తో ఇప్పటికే లింక్ చేశారు. మిగిలిన వారు త్వరగా చర్యలు తీసుకోవాలి, లేకపోతే జరిమానా చెల్లించాల్సిన పరిస్థితి తలెత్తుతుంది.

