కుక్కగోరు గుచ్చుకొని యువకుడు మృతి.. వామ్మో అంత డేంజరా? ఇలాంటి పని చేయకండి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పెంపుడు కుక్క గోరు గుచ్చుకోవడంతో ఓ యువకుడు రేబిస్ లక్షణాలతో మరణించాడు. అనుకోని విధంగా గోరు గుచ్చుకోవటం.. ఆ తర్వాత గాయాన్ని నిర్లక్ష్యం చేయటంతో యువకుడి ప్రాణం పోయింది. కుక్క కాటు లేదా గోరు గుచ్చుకోవడం ద్వారా సంక్రమించే రేబిస్ లక్షణాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వెంటనే వైద్య సహాయం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
హైలైట్:
- పెంపుడు కుక్క గోరుతో యువకుడి మృతి
- నిర్లక్ష్యం చేయటంతో పోయిన ప్రాణం
- రేబిస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యుల హెచ్చరిక
అహ్మదాబాద్ సిటీ పోలీస్ కంట్రోల్ రూమ్‌లో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న ఒక పోలీసు అధికారి కుక్కగోరు గుచ్చుకొని మరణించిన విషయం తెలిసిందే. గత 25 ఏళ్లుగా పోలీసు శాఖలో సేవలందిస్తున్న మంజారియా అనే అధికారి ఐదు రోజుల క్రితం అకస్మాత్తుగా తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యారు. అనుకోని విధంగా తన పెంపుడు కుక్క గోరు గుచ్చుకోవటంతో రేబిస్ వ్యాధి లక్షణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతడు ప్రాణాలు కోల్పోయాడు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ ఇటువంటి విషాదకర ఘటనే చోటు చేసుకుంది.
పెంపుడు కుక్క గోరు గుచ్చుకోవడం వల్ల ఒక యువకుడు రేబిస్ వ్యాధితో మరణించాడు. వివరాల్లోకి వెళితే.. ఏడూళ్లబయ్యారం గ్రామానికి చెందిన సందీప్ అనే పాతికేళ్ల యువకుడు రెండు నెలల క్రితం ఒక కుక్కపిల్లను ఇంటికి తీసుకొచ్చాడు. అయితే దానిని మచ్చిక చేసుకునే క్రమంలో సందీప్ తండ్రిని కుక్క కరిచింది. అదే సమయంలో అక్కడే ఉన్న సందీప్ చేతికి కుక్క కాలి గోరు గుచ్చుకుంది. తండ్రికి వెంటనే చికిత్స చేయించిన సందీప్.. తన గాయాన్ని చిన్నదే కదా అని నిర్లక్ష్యం చేశాడు.
అస్సలు నిర్లక్ష్యం చేయకండి..
కుక్క కాటు లేదా గోరు గుచ్చుకోవడం ద్వారా సంక్రమించే రేబిస్ వ్యాధి అత్యంత ప్రమాదకరమని, నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్ మెదడు, ఆ తర్వాత నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. సాధారణంగా కుక్క కాటు తర్వాత లక్షణాలు కనిపించడానికి కొన్ని వారాల నుంచి నెలల సమయం పడుతుందని తెలిపారు. ఒకసారి జ్వరం, తలనొప్పి, గందరగోళం, నీటిని చూస్తే భయపడటం (హైడ్రోఫోబియా) వంటి లక్షణాలు కనిపిస్తే రోగిని రక్షించడం దాదాపు అసాధ్యమని వైద్య నిపుణులు చెబుతున్నారు.

