ఏపీలో డ్వాక్రా మహిళలకు అద్భుతమైన అవకాశం.. ఒక్కొక్కరికి రూ.2.50లక్షలు, వివరాలివే …
Andhra Pradesh Dwcra Women Rs 250000: పట్టణ ప్రజల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘డీజీ లక్ష్మి’ అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా 250 రకాల సేవలు అందుబాటులోకి రానున్నాయి. డ్వాక్రా మహిళలు నిర్వహించే 9,034 కామన్ సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. శిక్షణ కోసం రూ.23.84 కోట్లు కేటాయించబడ్డాయి. కుప్పం నియోజకవర్గంలోని చెరువుల అభివృద్ధికి రూ.14.41 కోట్లు, రాజమహేంద్రవరంలో గోదావరి కాలుష్యం తగ్గించడానికి రూ.25 కోట్లు విడుదల చేసింది ప్రభుత్వం. ఈ పథకం మహిళలకు ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తుంది.
హైలైట్:
ఏపీలో డ్వాక్రా మహిళలకు మరో పథకం
ఒక్కొక్కరికి రూ.2.50 లక్షలు ఇస్తారు
ఏపీలో 9,034 కామన్ సర్వీస్ సెంటర్లు
ఏపీ ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని తీసుకొచ్చింది.. రాష్ట్రంలోని పట్టణ ప్రజల కోసం డీజీ లక్ష్మి పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. డీజీ లక్ష్మి ద్వారా ప్రజలకు 250 రకాల సేవలు అందించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 9,034 కామన్ సర్వీస్ సెంటర్లు (సీఎస్‌సీ-సాధారణ సేవా కేంద్రాలు) ఏర్పాటు చేస్తారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు (డ్వాక్రా మహిళలు) ఈ కేంద్రాలను నిర్వహిస్తారు. ఈ మేరకు ఈ సీఎస్‌సీ సెంట్లర్ల నిర్వహణ కోసం అర్హులైన సభ్యులను ఎంపిక చేసేందుకు మెప్మాకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఈ సీఎస్‌సీ కేంద్రాల ద్వారా ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. మీ-సేవా కేంద్రాల తరహాలోనే ఈ సెంటర్లలో వివిధ రకాల సేవల్ని ప్రజలు పొందవచ్చు. ఈ సెంటర్ల ద్వారా ప్రజలకు సేవలు అందించడంతో పాటుగా మహిళలకు ఉపాధి కూడా లభిస్తుందని భావిస్తోంది ప్రభుత్వం.
ఈ పథకానికి ఎంపిక కావాలంటే కొన్ని అర్హతలు ఉండాలి. ‘స్వయం సహాయక సంఘంలో కనీసం మూడేళ్ల క్రితం చేరి ఉండాలి. 21 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. వివాహం అయి ఉండాలి.. సంబంధిత స్లమ్ లెవెల్ ఫెడరేషన్ పరిధిలో నివాసి అయి ఉండాలి. డిగ్రీ చదివి ఉండాలి.. స్మార్ట్ ఫోన్ ఉండాలి. ఎంపికైన సభ్యులకు సెంటర్ ఏర్పాటు చేయడానికి రూ.2.50 లక్షల వరకు రుణం (కియోస్క్, ఇతర సదుపాయాల కల్పనకు) ఇస్తారు. ఏపీ ప్రభుత్వం ఈ పథకం ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలని చూస్తుంది. మహిళలకు ఉపాధి కల్పించాలనేది ప్రభుత్వ లక్ష్యం.