మంగళవారం మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఓ తీర్పు సంచలన వార్తగా నిలిచింది. మధురైలో వివాదాస్పదంగా మారిన తిరుప్పరంకుండ్రం దీపంపై కోర్టు ఇచ్చిన తీర్పుతో హిందూ సంఘాలు హర్షం వ్యక్తం చేసాయి. అయితే అసలేంటీ ఈ ఆలయ వివాదం అంటే.. తమిళనాడులోని మధురై దగ్గర ఉన్న తిరుప్పరంకుండ్రం కొండ, అక్కడి అరుల్మిగు సుబ్రమణ్య స్వామి ఆలయం చుట్టూ ఈ వివాదం ఏర్పడింది. ఈ ఆలయం మురుగన్ స్వామి ఆరు పడైవీడుల్లో ఒకటి. కొండపై ఉన్న రాతి స్తంభం విషయంలో హిందువులు, ముస్లింల మధ్య చాలా కాలంగా భేదాభిప్రాయాలు ఉన్నాయి.
ప్రభుత్వం ఈ స్తంభాన్ని బ్రిటిష్ కాలంలో 1802లో మధురై మ్యాపింగ్ కోసం పెట్టిన “సర్వే రాయి”గా చెబుతోంది. కానీ హిందూ భక్తులు దీనిని “దీప స్తంభం”గా భావిస్తూ, దాదాపు 75 ఏళ్లుగా కార్తీక దీపోత్సవ సమయంలో అక్కడ దీపం వెలిగించడం తమ సంప్రదాయమని చెబుతున్నారు. ఇది ఆలయ ఆచారాల్లో భాగమని, ఆగమ శాస్త్రాల ప్రకారం జరుగుతోందని వారు వాదిస్తున్నారు. మరోవైపు, అదే కొండపై 14వ శతాబ్దానికి చెందిన సికందర్ మలై దర్గా ఉంది. ఇది వక్ఫ్ బోర్డు ఆధీనంలో ఉంది. అక్కడ జరిగే ముస్లిం ప్రార్థనలు, జంతు బలి విషయాల్లో కూడా హిందూ సంస్థలు అభ్యంతరం తెలుపుతుండగా, ముస్లిం నాయకులు ఇవి తమ మత సంప్రదాయాలని చెబుతున్నారు.
ఈ వివాదం 2025లో మరింత తీవ్రమైంది. కొందరు ఈ కొండను జైన్ కొండగా ప్రకటించాలని కోర్టులో పిటిషన్ వేశారు. మరికొందరు దర్గాలో జంతు బలి ఆపాలని కోరారు. మరోవైపు, ముస్లిం వర్గాలు “కందర్ మలై” పేరును “సికందర్ మలై”గా మార్చాలని ప్రయత్నించాయి. హిందూ మక్కల్ కట్చి, హిందూ మున్నని, హిందూ తమిళిర్ పీరవై వంటి హిందూ సంస్థలు దీపం వెలిగించడానికి అనుమతి ఇవ్వాలని, జంతు బలి ఆపాలని డిమాండ్ చేశాయి. SDPI మద్దతుతో ముస్లిం నాయకులు తమ సంప్రదాయాల రక్షణ కోసం నిలబడ్డారు. రాజకీయంగా బీజేపీ హిందూ డిమాండ్లకు మద్దతు తెలిపింది. తమిళనాడు ప్రభుత్వం మాత్రం శాంతి భద్రతలకు భంగం కలగవచ్చని చెబుతూ దీపం వెలిగించడాన్ని వ్యతిరేకించింది. చివరికి ఈ వివాదం కాస్త మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్‌కు చేరింది.
డిసెంబర్ 2025 నుంచి జరిగిన విచారణలో జనవరి 6వ తేదీ మంగళవారం మద్రాస్ హైకోర్టు మధురై డివిజన్ బెంచ్ కీలక తీర్పు ఇచ్చింది. ప్రభుత్వ పిటిషన్‌ను తిరస్కరించి, హిందూ సంఘాలకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. దర్గాకు కనీసం 15 మీటర్ల దూరంలో కార్తీక దీపోత్సవ సమయంలో దీపం వెలిగించవచ్చని, ఇది హిందూ సంప్రదాయాల్లో భాగమని కోర్టు స్పష్టం చేసింది. దీని వల్ల శాంతి భద్రతలకు ప్రమాదం ఉండదని పేర్కొంది. ప్రతి సంవత్సరం ఆలయ అధికారులు, జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరగాలని ఆదేశించింది. అవసరమైతే పురావస్తు శాఖ (ASI)ని సంప్రదించాలని సూచించింది.
ఈ తీర్పును హిందూ సంస్థలు పెద్ద విజయంగా భావిస్తున్నాయి. ప్రభుత్వం చెప్పిన భయాలను కోర్టు నమ్మలేనివిగా పేర్కొంది. ఇక ముస్లిం వర్గాలు ఈ తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ వివాదం భవిష్యత్తులో ఆలయ నిర్వహణ, మత సామరస్యం అంశాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

