స్థానిక సంస్థలకు 28,785 కోట్లు

రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలకు కలిపి రూ.28,785 కోట్ల గ్రాంట్లను 16వ ఆర్థిక సంఘం సిఫారసు చేసింది.

రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలకు కలిపి రూ.28,785 కోట్ల గ్రాంట్లను 16వ ఆర్థిక సంఘం సిఫారసు చేసింది. ఇందులో గ్రామీణ స్థానిక సంస్థలకు (ఆర్‌ఎల్‌బీ) రూ.16,627 కోట్లు, పట్టణ స్థానిక సంస్థలకు (యూఎల్‌బీ) రూ.12,158 కోట్లు కేటాయించారు. ఆర్‌ఎల్‌బీ, యూఎల్‌బీల్లో ఇప్పటి వరకు 60:40 శాతం ఉన్న జాతీయ గ్రాంటును ఇప్పుడు 80:20 శాతం చేశారు. 16వ ఆర్థిక సంఘం ఐదేళ్ల కాలానికి గాను దేశవ్యాప్తంగా రూ.7,91,493 కోట్లు సిఫారసు చేసింది. గ్రామీణ జనాభా అంచనాల ఆధారంగా 90:10 నిష్పత్తిలో ఈ గ్రాంట్లను రాష్ట్రాలకు కేటాయించాలని పేర్కొన్నారు. ఆర్‌ఎల్‌బీ, యూఎల్‌బీల్లో ఉండే బేసిక్‌ కంపోనెంట్‌ మొత్తం విలువలో 50శాతాన్ని పారిశుధ్య, ఘన వ్యర్థాల నిర్వహణకు, లేదంటే నీటి నిర్వహణకు వాడాలని పేర్కొన్నారు. మిగతా 50 శాతంలో రోడ్ల నిర్మాణం, వాటి నిర్వహణకు 20 శాతం కంటే ఎక్కువ వాడకూడదని తెలిపారు.

ఏపీకి రూ.8,166 కోట్ల విపత్తు నిధులు

16వ ఆర్థిక సంఘం రాష్ట్ర విపత్తుల నిర్వహణ, నియంత్రణ నిధి కోసం రూ.2,04,401 కోట్లు సిఫారసు చేసింది. ఇందులో కేంద్రం వాటా రూ.1,55,915.85 కోట్లు, రాష్ట్రాల వాటా రూ.48,485.15 కోట్లు. ఈశాన్య రాష్ట్రాలకు 90:10 నిష్పత్తిలో, మిగతా రాష్ట్రాలకు 75:25 నిష్పత్తిలో ఈ నిధులు వాడాలి. వాడని విపత్తు నిధుల బ్యాలెన్స్‌ చివరి మూడేళ్ల కేటాయింపుల సగటు కంటే ఎక్కువగా ఉంటే కొత్తగా నిధులు విడుదల చేయరు. ఏపీకి విపత్తు నిధుల కింద రూ.8,166 కోట్లు సిఫారసు చేశారు. ఇక జాతీయ విపత్తు, నియంత్రణ నిధి కోసం రూ.79,406 కోట్లు కేటాయించారు. విపత్తు నిర్వహణ, నియంత్రణ ఖర్చు రూ2.50 కోట్లలోపు ఉంటే 10 శాతం, రూ.500 కోట్ల లోపు ఉంటే 20 శాతం రాష్ట్రాలు, రూ.500 కోట్ల దాటితే 25 శాతం రాష్ట్రాలు భరించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top