ఆదిలాబాద్లో ఐఏఎస్ అధికారి రాజర్షి షా ప్రవేశపెట్టిన ‘ఆరోగ్య పాఠశాల’ విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకొస్తుంది. ముఖ్యంగా 250కి పైగా పాఠశాలల్లో మార్పు మొదలైంది. పిల్లల హాజరుశాతం 70%కి పెరిగింది. ఆరోగ్యం, సామాజిక ఎదుగుదల, క్రమశిక్షణలో మెరుగైన ఫలితాలు సాధిస్తు్న్నారు.
ప్రార్థనా సమయంలో..
రాజర్షి షా పాఠశాలలను సందర్శించినప్పుడు.. 11 ఏళ్ల వయస్సున్న పిల్లలు పొగాకు నమలడం కనిపించింది. బాలికలైతే రుతుస్రావం పట్ల సరైన అవగాహన, సౌకర్యాలు లేకపోవడంతో స్కూలుకు డుమ్మా కొట్టేవాళ్లు. పరిశుభ్రత పట్ల గందరగోళం ఉండేది. ఈ నిశ్శబ్ద సంక్షోభాన్ని పరిష్కరించడానికి.. స్కూల్స్లో విస్మరించి అంశాలను పునర్విమర్శ చేయాలని నిర్ణయించారు. స్కూల్లో జరిగే ప్రార్థన సెషన్నే ‘ఆరోగ్య పాఠశాల’గా మార్చారు. 20 నిమిషాల ప్రార్థనా సమయంలో వ్యాయామం, చర్చలు, స్కిట్లు, పరిశుభ్రత, పోషణ, మానసిక ఆరోగ్యం, సామాజిక బాధ్యత గురించి నేర్చుకుంటారు.
ప్రతీరోజు ఒక థీమ్..
సోమవారం.. వ్యక్తిగత పరిశుభ్రత, మంగళవారం.. ఆరోగ్యం– పోషణ, బుధవారం.. ఒత్తిడి నిర్వహణ– మానసిక ఆరోగ్యం, గురువారం.. మాదకద్రవ్య వ్యతిరేక విద్య, శుక్రవారం.. వ్యాధి నివారణ, శనివారం.. ఆత్మవిశ్వాసం–నాయకత్వం వంటి అంశాలపై చర్చ, అవగాహన కార్యక్రమాలు జరుగుతాయి. వీటిని ప్రవేశపెట్టిన వెంటనే ఫలితాలు కనిపించడంతో మరింత ఉత్సాహంతో ముందుకెళ్తున్నారు. హాజరు 50 శాతం నుంచి దాదాపు 70 శాతానికి పెరిగింది. 2024 బాలల దినోత్సవం రోజున ప్రారంభించిన ఈ కార్యక్రమం జిల్లాలో 250కి పైగా పాఠశాలలు ఆరోగ్యం, విద్యను సమీపించే విధానాన్ని ఇప్పటికే మార్చేసింది.
ఆరోగ్య పాఠశాల ఎందుకు.?
ఆదిలాబాద్ అత్యంత సామాజిక-ఆర్థికంగా వెనుకబడిన జిల్లాలలో ఒకటి. జనాభాలో దాదాపు 45 శాతం షెడ్యూల్డ్ కులాలు, గిరిజనులే. పేదరికం, పోషకాహార లోపం, ఆరోగ్య సౌకర్యాలు అందుబాటు లేవు. పిల్లల్లో, తల్లిదండ్రుల్లో ఆరోగ్య అవగాహన లేదు. చేతులు కడుక్కోవడం, స్నానం చేయడం వంటి ప్రాథమిక అలవాట్లు నిర్లక్ష్యం చేయబడ్డాయి. కొందరు అవగాహన లేక పొగాకు నములుతుంటారు. ఆరోగ్యం, పరిశుభ్రత సూత్రాలు పాఠ్యాంశంలో ఉన్నప్పటికీ మరింత అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో వినూత్న ప్రచార శైలిని అవలంబించాలనే ఆలోచనతో ఆరోగ్య పాఠశాలకు శ్రీకారం చుట్టారు.
స్కోచ్ అవార్డు..
కలెక్టర్ అధ్యక్షతన జిల్లా-స్థాయి కమిటీ పనిచేస్తుంది. ఉపాధ్యాయులు ఈ మార్పు పాఠశాలల్లో మాత్రమే కాకుండా ఇళ్లలో కూడా కనిపించేలా ప్రణాళిక చేశారు. విద్యార్థులు ఆరోగ్య సందేశాలను తమ గ్రామాలకు, కుటుంబాలకు తీసుకెళ్తున్నారు. ఆరోగ్య పాఠశాల గ్రామాలలోకి విస్తరిస్తే, తల్లిదండ్రులు కూడా సంతృప్తి చెందితే, మార్పు మరింత వేగంగా జరుగుతుంది. పిల్లలు ఇప్పుడు స్కిట్లు, డ్రాయింగ్లు, డిబేట్ల ద్వారా స్వయంగా అవగాహన కార్యకలాపాలను నడిపించొచ్చు. ఈ కాన్సెప్ట్ జాతీయ దృష్టిని ఆకర్షించింది. గవర్నెన్స్ ప్రాజెక్టులలో శ్రేష్ఠతను గుర్తించే ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డును గెలుచుకుంది.
