శంకరుల స్తోత్రమాలా మణిపూసలు


సనాతన ధర్మంలో ఎందరో దేవతామూర్తులున్నారు. ఆయా దేవతలను ఇష్టదైవాలుగా కలిగి ఉన్నవారు ఉన్నారు. అయితే ఏ దేవుణ్ని ఆరాధించినా తరించవచ్చని, అందరు దేవతలు సమానమేనని ఆయా దేవతా మూర్తులను ఆరాధించేందుకు వీలైన స్తోత్రాలను రచించి మానవాళికందించిన ఆ శంకరుని అపరావతారమే ఆదిశంకరాచార్యులు. ఈనాడు మనం నిత్యం చదివే స్తోత్రాలలో ఆదిశంకర కృతమైనవి ఉంటాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆయన రచించిన ప్రతి శ్లోకం ఒక మహామంత్రం. ఆయన రచించిన స్త్రోత్ర సాహిత్యంలో కొన్ని వాటి గురించి వివరణాత్మకంగా తెలుసుకుందాం.
బాలబోధ సంగ్రహం
ఇది తోటి పిల్లలకు నీతినీ, ధర్మాన్ని తెలిపే సరళ భాషా స్తోత్రము. ఇది శంకరుని తొలి రచన.
కనకధారాస్తవం
ఉపనయనానంతరం ఒక బ్రాహ్మణి కటిక పేదరికాన్ని చూసి కరిగి ఒక ఉసిరికాయను భిక్షగా స్వీకరించి సిరుల తల్లిని ఈ స్తోత్రంతో ప్రసన్నురాలిని చేశారు. ఈ స్తోత్రం చేసిన వెంటనే ఆ తల్లి సంపదలు వర్షింపజేసింది.
అచ్యుతాష్టకం
భగవంతుని ధ్యాస ఎక్కువైన తల్లి ఆర్యాంబ కోసం అచ్యుతాష్టకం రచించి దాని అర్థాన్ని తల్లికి వినిపించి పునీతులను చేశారు.
శ్రీకృష్ణాష్టకం
తల్లి ఆర్యాంబకు జగద్గురువైన శ్రీకృష్ణభగవానుడంటే ఇష్టమని ఈ అష్టకాన్ని రచించి వినిపించారు. భక్తితో వింటూ భగవంతునిలో లీనమైపోయింది ఆ మాతృమూర్తి.

నర్మదాష్టకం
తన లక్ష్య సాధనకై పయనించే వేళ వరదలతో ప్రజలను ముంచెత్తుతున్న నర్మదానదిని కీర్తించిన స్తోత్రమిది. దానితో ఆ నది శాంతించింది.
గంగా స్తోత్రం
కాశీలో గంగలో స్నానమాచరించి గంగను ప్రార్థించిన శ్లోకం. అక్కడి మణికర్ణికా ఘట్టాన్ని దర్శించి మణికర్ణికాష్టకం రచించారు.
ధన్యాష్టకం
బాదరాయణ మునిని దర్శించి పులకించి ధన్యాపకం రచించారు.
గురుపాదుకా స్తవం
గురువే దైవమని భావించి గురువు విశిష్టతలను తెలుపుతూ గురుపాదుకా స్తవం రచించారు.
ప్రయాగాష్టకం
ప్రయాగ చేరి అక్కడి త్రివేణీ సంగమం ప్రదేశంలో ప్రయాగాష్టకం, మాధవాష్టకం, లక్ష్మీనరసింహ పంచరత్నాలు కరావలంబస్తోత్రం చేశారు.
యోగ తారావళి
యోగవిద్య సకల జనులకు శాంతి సౌఖ్యాలనందిస్తుందని తెలుపుతూ యోగ తారావళి రచించారు.
జగన్నాథాషకం
పూరీ పట్టణంలో జగన్నాథుని దర్శించి ఆ దేవుని మీద ఈ స్తోత్రం చేశారు.
దక్షిణామూర్తి స్తోత్రం
శివుని జ్ఞాన రూపమైన దక్షిణామూర్తిపై రచించిన స్తోత్రమిది.
శివ మానస పూజ
శైవులు మాత్రమే కాక సకల జనులు శివుని ఏ విధంగా ఆరాధించాలనే భావనలను నింపిన స్తోత్రమిది. భవానీ భుజంగ స్తోత్రం – గౌరీ దశకం అమ్మ పార్వతీ దేవిని భవానిగా స్తుతిస్తూ సాగిన స్త్రోత్రం గౌరీదశకం ఇంకా రామ భుజంగ స్తోత్రం, విష్ణు భుజంగ ప్రయాత స్తోత్రం, హనుమద్ పంచరత్నాలు, నవరత్న మాలికా స్తోత్రం, పాండురంగాష్టకం, కళ్యాణ వృష్టిస్తవం, గుర్వష్టకం, కాశీ విశ్వనాధస్తవం. శివకేశాదిపాదాంతవర్ణన స్తోత్రం, దేవీ చతుష్షష్ట్యుపచార మానస పూజ, పుష్కరాష్టకం, శివానంద లహరి, భజ గోవింద స్తోత్రాలు, అశాశ్వతమైన మానవ జీవితం గురించి తెలిపే ఈ భజగోవింద స్తోత్రాలు ఇప్పటికీ దేశమంతటా మారుమోగుతున్నాయి.
