ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఆదివారం ఆయన నేలపాడులో గెజిటెడ్ అధికారుల ఇళ్లను పరిశీలించారు. అనంతరం భవన నిర్మాణాల పనుల పురోగతిపై సీఆర్డీఏ ఇంజినీర్లు, గుత్తేదారు సంస్థ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అమరావతిలో ఇళ్ల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనను వేగవంతం చేయాలని మంత్రి సూచించారు. ప్రస్తుతం అమరావతిలో గెజిటెడ్ అధికారులకు 14 టవర్స్ లో 1440 ఇళ్లను నిర్మిస్తున్నారు. టైప్ -1లో 384, టైప్ -2లో 336 ఇళ్లు, గ్రూప్ – డి అధికారుల కోసం 720 ఇళ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. డిసెంబర్ 31 లోగా అన్ని టవర్ల నిర్మాణాలను పూర్తి చేస్తామని, అమరావతిలో రోడ్లు, డ్రెయిన్ల పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. ఐఏఎస్ అధికారుల టవర్ల నిర్మాణం కూడా దాదాపుగా పూర్తైందన్నారు.
ఇటీవల కురిసిన వర్షాలకు అమరావతి మునిగిపోయిందని, అక్కడ ఇళ్ల నిర్మాణ పనులు జరగడం లేదని కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఏసీ రూముల్లో కూర్చుని చూసే వారికి నిర్మాణాల గురించి తెలియని, బయటకు వచ్చి చూస్తే నిజనిజాలేంటో తెలుస్తాయన్నారు. ఎంతమంది నిర్మాణాల్లో పనిచేస్తున్నారో, ఎన్ని కంపెనీలు రన్ అవుతున్నాయో కళ్లు తెరచి చూడాలని సూచించారు. అమరావతి గురించి అబద్ధాలు మాట్లాడితే ప్రజలే ఛీ కొడతారన్నారు.
ఇక రాజధాని నిర్మాణానికి కావలసిన మిగతా భూమిని భూసేకరణ ద్వారా తీసుకునేందుకు సీఆర్డిఏ ఆమోదం తెలిపిందని మంత్రి పేర్కొన్నారు. భూ సేకరణ కంటే భూసమీకరణ వల్లే రైతులకు ఎక్కువ లాభమని తెలిపారు.

