శ్రీవారి ఆలయంలో అరుదైన ఘట్టం- 51 అప్పాలతో..

Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం నాడు 76,343 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 18,768 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 4.34 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 26 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 15 నుంచి 117 గంటల సమయం పట్టింది. కంపార్ట్ మెంట్లు, క్యూలైన్లల్లో ఉన్న భక్తులకు టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అన్నప్రసాదాలను పంపిణీ చేాశారు.
ఈ నెల 24, 27, 30 తేదీల్లో శ్రీవారి ఆలయం, తిరుపతి గోవిందరాజ స్వామి గుడిలో స్వామివారికి విశేష ఉత్సవాలు, ప్రత్యేక పూజలు జరుగనున్నాయి. 24న తిరుమల నంబి శాత్తుమొర, 27న మణవాళ మహాముని శాత్తుమొర, 30న వేదాంత దేశికుల శాత్తుమొర ఉత్సవాలను నిర్వహించనున్నారు. వైష్ణవ సంప్రదాయాల్లో ఒకటైన అప్పపడి నివేదన ద్వారా ఆయా తేదీల్లో శ్రీవారు, గోవిందరాజస్వామివారిని పూజిస్తారు. ఇందులో 51 అప్పాలు, పచ్చ కర్పూరం, గంధపు చెక్క ఉంచి తిరుమల అర్చకులు, జీయర్ స్వాములు, అర్చకుల సమక్షంలో శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ పడిని పోటు పరిచారకులు ఆలయ నాలుగు మాడ వీధుల గుండా ఊరేగిస్తూ తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామి ఆలయానికి చేర్చుతారు. ఆయా సన్నిధికి చెందిన ఆచార్య పురుషుల శిష్యుల ద్వారా పడిని ఊరేగింపుగా తీసుకువెళ్లి గోవిందరాజస్వామి ఆలయంలో వెలసివున్న ఆయా ఆచార్యుల సన్నిధిలో శాత్తుమొర నిర్వహిస్తారు. శ్రీవారు స్వయంగా భక్తులకు ప్రసాదాన్ని పంపించే ఆచారంగా దీన్ని భావిస్తారు.
11వ శతాబ్దంలో శ్రీ వేంకటేశ్వర స్వామివారికి నిత్యపూజలు చేసిన భక్తుడు తిరుమల నంబి. ఆకులతో నీటిని కొండపైకి తీసుకెళ్లి స్వామివారికి పూజలు చేసినట్లు చరిత్ర చెబుతోంది. 15వ శతాబ్దానికి చెందిన మణివాల మహాముని రామానుజీయ విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రజల్లో విస్తరించి, గురుపరంపర పరిరక్షణలో అపూర్వ కృషి చేశారు. 13-14వ శతాబ్దానికి చెందిన శ్రీవైష్ణవ తత్వవేత్త వేదాంత దేశికులు. విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. సంస్కృతం, తమిళ భాషల్లో 120కు పైగా గ్రంథాలు రచించారు. శ్రీరామానుజాచార్యుల ఉపదేశాలను విశ్వవ్యాప్తం చేశారు. అందుకే వారి పేర్ల మీద ఈ మూడు తేదీల్లో శ్రీవారికి అప్పపడిని నిర్వహించనున్నారు అర్చకులు.
