IND vs AUS: Rohit Sharma creates history!

టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో ఆస్ట్రేలియా గడ్డపై ఆ జట్టుపై 1000* పరుగులు చేసిన తొలి భారత బ్యాటర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియాతో అడిలైడ్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో హాఫ్ సెంచరీ చేయడం ద్వారా రోహిత్ ఈ ఫీట్ సాధించాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ తర్వాత విరాట్ కోహ్లీ(9802), సచిన్ టెండూల్కర్ (9740), మహేంద్ర సింగ్ ధోనీ(684), శిఖర్ ధావన్(517) ఉన్నారు. కాగా రోహిత్ ఇప్పటి వరకు 275 వన్డేల్లో 11,184* పరుగులు చేశాడు. ఇందులో 32 సెంచరీలతో పాటు 59 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 264.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆశించిన ఆరంభం దక్కలేదు. ఒకే ఓవర్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్(9)తో పాటు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(0) వెనుదిరిగాడు. బౌలింగ్‌కు అనుకూలంగా ఉన్న కండిషన్స్‌పై ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ తడబడ్డారు. ఆచితూచి ఆసీస్ బౌలర్లను ఎదుర్కొన్నారు.

7వ ఓవర్‌ తొలి బంతికి శుభ్‌మన్ గిల్(9)ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చిన గ్జేవియర్ బార్ట్‌లెట్.. ఐదో బంతికి విరాట్ కోహ్లీని వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. దాంతో 17 పరుగులకే టీమిండియా రెండు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్‌తో కలిసి రోహిత్ శర్మ(73) జట్టును ఆదుకున్నాడు. 74 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ.. స్టార్క్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో మూడో వికెట్‌కు నమోదైన 118 పరుగులు భాగస్వామ్యానికి తెరపడింది.

ఇక తన 17 ఏళ్ల వన్డే క్రికెట్‌లోనే విరాట్ కోహ్లీ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌటవ్వడం ఇదే తొలిసారి. సుదీర్ఘ విరామం తర్వాత బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌటవ్వడం అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది. పెర్త్ వేదికగా జరిగిన తొలి వన్డేలోనూ కోహ్లీ డకౌట్ అయిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో క్యాచ్ ఔట్ అయిన కోహ్లీ.. తాజా మ్యాచ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు.



		
		
			

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *