తిరుమలలో తాజా పరిస్థితి ఇలా!

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో ఇది పశ్చిమ వాయువ్యంగా కదిరి 36 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఈ రోజు తిరుపతి, కడప, నెల్లూరు, ఒంగోలు జిల్లాలలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
తిరుమలలో భారీ వర్షం రేపు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేస్తున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే కలియుగ ప్రత్యక్ష దైవం, ఏడుకొండల పైన కొలువుతీరిన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తిరుమలకు వస్తున్నారు. అయితే నేడు మారిన వాతావరణ పరిస్థితులతో తిరుమలలో వర్షం భారీగా కురుస్తోంది.
తిరుమలలో వర్షంతో భక్తుల ఇబ్బందులు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఈ తెల్లవారుజాము నుండే తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు.శ్రీవారి దర్శనం చేసుకునే భక్తులు వర్షంలో తడవకుండా ఉండేందుకు జాగ్రత్తలు పడుతున్నారు. దర్శనం చేసుకుని వెలుపలకు వచ్చిన భక్తులు తలదాచుకునేందుకు షెడ్ల వైపుకు పరుగులు తీస్తున్నారు. వర్షాలతో భక్తులకు టీటీడీ సూచనలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం, అదేవిధంగా విపరీతమైన చలి ఉండడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇక వర్షాల నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తులకు టిటిడి అధికారులు సూచనలు చేస్తున్నారు. భారీ వర్షాలు పడుతున్న సమయంలో ఘాట్ రోడ్లలో ప్రయాణించ వద్దని, భక్తులు జాగ్రత్తగా ఉండాలని టిటిడి సూచిస్తోంది. వర్షం తగ్గుముఖం పట్టే వరకు తిరుమలలో భక్తులు సురక్షిత ప్రాంతాలలో ఉండాలని చెబుతున్నారు.
బాగా పెరిగిన చలి, వర్షంతో వీళ్ళు జాగ్రత్త: టీటీడీ చలి తీవ్రత కూడా ఎక్కువగా ఉండడంతో చిన్నారులు, వృద్ధుల విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని టిటిడి సూచనలు చేస్తోంది. ఇదిలా ఉంటే నిన్న తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే అధికంగా ఉంది నిన్న భక్తులతో అన్ని కంపార్ట్మెంట్లో నిండిపోగా శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పట్టింది. తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవడానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. దీంతో వర్షం పడుతున్న కారణంగా భక్తులు జాగ్రత్తగా ఉండాలని టిటిడి అధికారులు సూచిస్తున్నారు.

