Hyderabad: మూసాపేట స్టేషన్‌లో ఓ ప్యాసింజర్ స్కానర్‌లో బ్యాగ్ పెట్టగానే మోగిన అలారం.. చెక్ చేయగా

హైదరాబాద్ నగరంలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. శనివారం రాత్రి మూసాపేట మెట్రో స్టేషన్‌లో సాధారణ స్కానింగ్ సమయంలో ఓ ప్రయాణికుడి బ్యాగ్‌లో బుల్లెట్ కనిపించడంతో కలకలం రేగింది. వివరాల్లోకి వెళ్తే… బీహార్‌కు చెందిన మహ్మద్ అనే యువకుడు ప్రగతినగర్‌లో ఫ్యాబ్రికేషన్ పనులు చేస్తూ.. రొజువారీగా మెట్రోలో ప్రయాణిస్తుంటాడు. అదే క్రమంలో శనివారం స్టేషన్ వద్ద తన బ్యాగ్‌ను స్కానర్‌లో ఉంచగానే అలారం మోగింది. సిబ్బంది తనిఖీ చేయగా 9 మిల్లీమీటర్ల బుల్లెట్ బయటపడింది.
తక్షణమే భద్రతా సిబ్బంది కూకట్‌పల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మహ్మద్‌ను విచారణకు తీసుకున్నారు. బుల్లెట్ తన దగ్గరికి ఎలా వచ్చిందన్న ప్రశ్నకు.. అతను స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోయాడు. దీంతో పోలీసులు అక్రమ ఆయుధాల కోణంలో దర్యాప్తు చేపట్టారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న వారిపై పూర్తి నిఘా ఉంచాల్సి అవసరం కనిపిస్తుంది.
