Tirumala: ఈ ఏడాది తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వారాలు తెరిచేదెన్ని రోజులు..

హిందువులు ఏకాదశి తిథిని అత్యంత పవిత్రంగా భావిస్తారు. ప్రతి ఏడాది 24 ఏకాదశి తిథులు వస్తాయి. దేనికదే ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఈ ఏకాదశి తిథుల్లో వైకుంఠ ఏకాదశి విశేషమైన ప్రాముఖ్యత తుంది. త్వరలో వైకుంఠ ఏకాదశి రానున్న నేపధ్యంలో తిరుమలలో స్వామివారి వైకుంఠ ద్వారాలు తెరిచేదెన్ని రోజులు అనే చర్చ మొదలైంది.
తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు ఎన్ని రోజులు తెలుస్తారన్న దానిపై చర్చ మొదలైంది. ఈ ఏడాది డిసెంబర్ 31 న వైకుంఠ ఏకాదశి రోజు తెలుసుకోనున్న వైకుంఠ ద్వారాలు పది రోజులపాటు తెరిచి ఉంచాలా… లేదంటే ముక్కోటి ఏకాదశి ద్వాదశి రెండు రోజులే వైకుంఠ ద్వార దర్శనం భక్తులకు అందుబాటులో ఉంచాలా… అన్నదానిపై ఇప్పటినుంచే చర్చ మొదలైంది. ఈ ఏడాది జనవరి 8న వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీలో జరిగిన అపశృతిని దృష్టిలో ఉంచుకొని టీటీడీ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియక తర్జన భర్జన పడుతుంది. ఇంకా రెండున్నర నెల సమయం ఉన్నా ఇప్పటి నుంచి కసరత్తు ప్రారంభించింది. ఎప్పటినుంచో ముక్కోటి ఏకాదశి, ద్వాదశి రెండు రోజులే తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు తెరిచి భక్తులకు శ్రీవారి దర్శనాన్ని కలిగిస్తున్న టీటీడీ గత ప్రభుత్వ హయంలో పది రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించింది.
ఈ ఏడాది జనవరిలో వైకుంఠ ద్వార దర్శనాలను 10 రోజులపాటు తెరిచి ఉంచిన టీటీడీ టోకెన్ల జారీలో వ్యవహరించిన తీరు విమర్శలకు దారితీసింది. ఆరుగురు భక్తులు మృతి చెందగా 40 మందికి పైగా భక్తులు గాయపడ్డ ఘటన కలకలం రేపింది. టీటీడీ ఎన్నో విమర్శలకు గురికాగా ఇందుకు బాధ్యులైన అధికారులపై ప్రభుత్వం చర్యలు కూడా తీసుకుంది. ఈ నేపథ్యంలో ఏడాది డిసెంబర్ 31న జరగనున్న వైకుంఠ ఏకాదశి కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి నిర్ణయాలు అమలు చేయాలో ఇప్పటినుంచే కసరత్తు ప్రారంభించింది.
ఇందులో భాగంగా ఇప్పటికే సమావేశాలు కూడా నిర్వహించిన టీటీడీ ఈ మేరకు సమాయత్తం అవుతుంది. డిసెంబర్ 31, జనవరి 1 ఈ రెండు రోజులు ఏకాదశి ద్వాదశి పర్వదినాలు కావడం మరోవైపు నూతన సంవత్సరం తొలి రోజున భక్తుల తాకిడి ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని భావిస్తున్న టీటీడీ వైకుంఠ ద్వార దర్శనాలపై ఎలా ముందుకు వెళ్లాలో తెలియక తికమకపడు తోంది. ఈ నేపథ్యంలో కొత్త వాదన తెర మీదకి వస్తోంది. గతంలో మాదిరిగా పది రోజులు కాకుండా ఏకాదశి ద్వాదశి రెండు రోజులు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనాలు తెరిచి ఉంచాలన్న డిమాండ్ టీటీడీ ముందు ఉంది.
తిరుపతిలో టీటీడీ పరిపాలన భవనంలో ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ను కలిసిన ఏపీ సాధు పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి వైకుంఠ ఏకాదశికి రెండు రోజులే వైకుంఠ ద్వారాలు తెరవాలని కోరారు. వైకుంఠ ఏకాదశి పవిత్రత నిండుగా ఉండాలంటే 2 రోజులు మాత్రమే వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంచాలన్నారు. వైకుంఠం ద్వారాలు 10 రోజులు తెరిచి ఉంచే సంస్కృతి వైసీపీ ప్రభుత్వంలో ప్రారంభమైందన్నారు. కాసులు దండుకోవడానికే గతంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంచారన్నారు. శాస్త్ర విరుద్థంగా ప్రవర్తించవద్దని టీటీడీ ఇఓ అనిల్ కుమార్ సింఘాల్ ను కలిసి విజ్ఞప్తి చేశారు శ్రీనివాసానంద. వైకుంఠ ఏకాదశి ద్వాదశి 2 రోజులు మాత్రమే ద్వారాలు తెరిచి ఉంచాలన్నారు. వైకుంఠం ఏకాదశి రోజు సామాన్య భక్తులకే పెద్దపీట వేయాలని విజ్ఞప్తి చేసారు ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద.
ఈ ఏడాది టీటీడీకి చాలెంజే.
మరో వైపు టీటీడీ కూడా ఏడాది రెండు రోజులే వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించాలన్న ఆలోచన చేస్తోందన్న ప్రచారం వినిపిస్తోంది. వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ల జారీ విషయంలోనూ ఆలోచిస్తోంది. రెండు రోజుల పాటే వైకుంఠ ద్వార దర్శనాలకు అవకాశం ఉంటే టోకన్ల ను భక్తులకు ఎలా కేటాయించాలన్న దానిపై సమాలోచనలు చేస్తోంది. ఆన్ లైన్ లో కేటాయించాలా లేదంటే ఆఫ్ లైన్ విధానం అమలు చేయాలా అన్న దానిపై క్లారిటీ రాకపోతోంది. ఇది ఏమైనా భక్తులకు ఇబ్బంది కలగకుండా, గతంలో మాదిరిగా ఎలాంటి అపశృతి చోటు చేసుకోకుండా జాగ్రత్తలు పాటిస్తున్న టీటీడీకి ఏడాది వైకుంఠ ద్వారా దర్శనాలు కల్పించడం సవాలుగా మారింది.

