Parents should do activity to their children during summer vacation

పిల్లలకు వేసవి సెలవులు వచ్చేస్తున్నాయి. ఇది పిల్లలకి ఎంతో ఉత్సాహభరితంగా ఉండే సమయం. స్కూల్ లేని స్వేచ్ఛ, ఆడుకోవడానికి ఎక్కువ సమయం, కుటుంబంతో గడిపే మధుర క్షణాలు ఇవన్నీ పిల్లలకే కాక తల్లిదండ్రులకు కూడా ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం తల్లిదండ్రుల బాధ్యత. సరైన ఆలోచన లేకుండా విడిచిపెట్టితే పిల్లలు టీవీ, మొబైల్‌ లతో సెలవులను గడిపేస్తారు. కాబట్టి వేసవి సెలవుల్లో పిల్లల అభివృద్ధికి తోడ్పడే కొన్ని పేరెంటింగ్ చిట్కాలు. పిల్లలకి క్రమశిక్షణ అలవాటు చేసేందుకు ఒక సులువైన టైమ్ టేబుల్ రూపొందించండి. ఉదయం లేచే సమయం, ఆహారం, ఆటల సమయం, చదువుకునేందుకు సమయం, నిద్ర అన్నీ ఒక షెడ్యూల్ ప్రకారం ఉండాలి. ఇది పిల్లల్లో సమయ పాలనను మెరుగుపరుస్తుంది.

వేసవి సెలవుల్లో పూర్తిగా చదువుపై ఒత్తిడి పెట్టకుండా, అర్థవంతమైన రీతిలో నేర్చుకునే అవకాశం కల్పించండి. కథలు చదివే అలవాటు, పజిల్స్, విద్య సంబంధిత గేమ్స్ లేదా ప్రాజెక్టుల రూపంలో నేర్పండి. పెయింటింగ్, డాన్స్, సంగీతం, కోడింగ్ వంటి క్రియేటివ్ ఆసక్తులు ఉండే పిల్లలకు ప్రోత్సాహం ఇవ్వండి. ఇది వారి చొరవను పెంచుతుంది. అలాగే మరింత ఫోకస్ మెరుగవుతుంది. కొన్ని సార్లు చిన్న చిన్న ఇంటి పనుల్లో పిల్లల్ని భాగస్వాములుగా చేయండి. పిల్లలు రోజూ బయట లేదా ఇంట్లో శారీరకంగా చురుకుగా ఉండే ఆటలలో పాల్గొనేలా ఏర్పాటు చేసుకోండి. వేసవిలో అధిక వేడి ఉండే సమయంలో ఉదయం లేదా సాయంత్రం సమయంలో ఆటలకి అవకాశం కల్పించండి.

సెలవుల పేరుతో మొబైల్ లేదా టీవీ ముందు గంటల తరబడి కూర్చోవడం శారీరక, మానసికంగా హానికరం. కాబట్టి, వీటి వినియోగానికి ఓ సమయం నిర్దేశించండి.

వేసవి సెలవులు పిల్లలతో అనుబంధాన్ని మరింత బలపరచే సమయం. కలిసి కూర్చుని భోజనం చేయడం, ప్రయాణాలు చేయడం, చిన్నపాటి ఆటలాడటం వంటి చిన్న సంఘటనలే వారికి పెద్ద మధురానుభూతులు అవుతాయి. లేదా ఎక్కడైనా పిల్లల కోసం ప్రత్యేక వేసవి శిబిరాలు, క్లాస్‌లు ఉంటే వాటిని పరిశీలించండి. కొత్త నైపుణ్యాలు నేర్చుకునే అవకాశంగా ఇవి ఉపయోగపడతాయి.

నూతలపాటి నాగేశ్వరరావు తెనాలి 9490742134

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *