పాయింట్ బ్లాంక్‌లో గన్ పెట్టి బెదిరించిన మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ..!!

మంత్రి కొండా సురేఖ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది .కొద్ది రోజుల క్రితం మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కోల్డ్ వార్ చేయగా… ఆతర్వాత ఆమె ఓఎస్డీ సుమంత్ పై తీవ్రమైన అవినీతి ఆరోపణలు రావడంతో అతన్ని ఓఎస్డీగా తొలగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తాజాగా సుమంత్‌కు సంబంధించి మరో ఉదంతం వెలుగు చూసింది.
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ మరోసారి మంత్రి ప్రతిష్టకు భంగం కలిగే పనిచేశారు. ఈసారి డబ్బుల వసూలుకు ఎదుటి వ్యక్తిపై గన్ పెట్టి బెదిరించిన ఘటన వెలుగులోకి వచ్చింది.హుజూర్ నగర్ నియోజకవర్గంలో డెక్కన్ సిమెంట్స్ కంపెనీ వారిని డబ్బులు ఇవ్వాలని పాయింట్ బ్లాంక్‌లో గన్ పెట్టి సుమంత్ బెదిరించినట్లు తీవ్ర ఆరోపణలు వచ్చాయి.ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. తన నియోజకవర్గంలో మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ పెత్తనం ఏంటని ఉత్తమ్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఇదొకటైతే సీఎం రేవంత్‌కు అత్యంత సన్నిహితులుగా గుర్తింపున్న రోహిన్ రెడ్డి పై కూడా గన్ పెట్టి డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆరోపణలున్నాయి.అవినీతి, అధికారులపై ఒత్తిడి, కాలుష్య పరిశ్రమల నిర్ణయాల్లో జోక్యం వంటి ఆరోపణల నేపథ్యంలో సుమంత్‌ను విధుల నుంచి తొలగిస్తూ ప్రభుత్వం మంగళవారం (అక్టోబర్ 14, 2025) ఉత్తర్వులు జారీ చేసింది.
మంత్రి నివాసం వద్ద హైడ్రామా: విధుల నుంచి తొలగించబడిన సుమంత్.. మంత్రి కొండా సురేఖ ఇంట్లో తలదాచుకున్నారనే సమాచారంతో వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మఫ్టీలో సురేఖ నివాసానికి చేరుకున్నారు. సుమంత్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా, కొండా సురేఖ, ఆమె కూతురు సుస్మిత వారిని అడ్డుకున్నారు. సుమంత్ అరెస్ట్‌కు గల కారణాలు స్పష్టంగా చెప్పాలని సుస్మిత పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చివరకు, పోలీసులు చూస్తుండగానే మంత్రి కొండా సురేఖ, సుమంత్ ఒకే కారులో బయటకు వెళ్లినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో మంత్రి నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.

