అక్టోబర్లో 20 రోజులు బ్యాంకులకు సెలవులు.. పనులు ఉంటే ముందుగానే ప్లాన్ చేసుకోండి …

October Bank Holidays: ఈ ఆర్థిక సంవత్సరంలో మరో నెల ముగిసింది. కొత్తగా ప్రారంభమవుతున్న అక్టోబర్ మాసంలో దాదాపుగా 20 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి.సాధారణ వారాంతపు సెలవులతో పాటు పండుగలు, జాతీయ దినోత్సవాల కారణంగా ఈ నెలలో ఎక్కువ రోజులు బ్యాంకులకు సెలవులు ఉండబోతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ (RBI) ఇప్పటికే అధికారికంగా ఈ జాబితాను విడుదల చేసింది. అందువల్ల కస్టమర్లు తమ ఆర్థిక సంబంధిత పనులను ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిది.
ముఖ్యంగా పెద్ద మొత్తంలో నగదు డిపాజిట్లు, డిమాండ్ డ్రాఫ్ట్లు, చెక్ క్లియరెన్స్ వంటి సేవల కోసం బ్యాంకుకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే బ్యాంకులు మూసివేసినా మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ సర్వీసులు యథావిధిగా పనిచేస్తాయి. అలాగే నగదు ఉపసంహరణ కోసం ATMలు, క్యాష్ డిపాజిట్ మెషిన్లు అందుబాటులో ఉంటాయి.
అక్టోబర్లో బ్యాంకు సెలవుల జాబితా అక్టోబర్ 1: మహర్నవమి, దుర్గాపూజల కారణంగా అగర్తల, బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, గౌహతి, కొచ్చి, కోల్కతా, పాట్నా వంటి నగరాల్లో సెలవు. అక్టోబర్ 2: మహాత్మా గాంధీ జయంతి, దసరా, తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా సెలవు. అక్టోబర్ 3: దుర్గాపూజ సందర్భంగా గాంగ్టక్లో బ్యాంకులు బంద్. అక్టోబర్ 5: ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా సెలవు. అక్టోబర్ 6: లక్ష్మీపూజ సందర్భంగా అగర్తల, కోల్కతాలో బ్యాంకులు బంద్. అక్టోబర్ 7: వాల్మీకి జయంతి, కుమార్ పూర్ణిమ సందర్భంగా బెంగళూరు, భువనేశ్వర్, సిమ్లా వంటి ప్రాంతాల్లో సెలవు. అక్టోబర్ 10: కర్వా చౌత్ సందర్భంగా సిమ్లాలో బ్యాంకులు మూసివేత. అక్టోబర్ 11: రెండో శనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా సెలవు. అక్టోబర్ 12: ఆదివారం సందర్భంగా బ్యాంకులు బంద్. అక్టోబర్ 18: కటి బిహు సందర్భంగా గౌహతిలో బ్యాంకు సెలవు. అక్టోబర్ 19: ఆదివారం కావడంతో సెలవు. అక్టోబర్ 20: దీపావళి, నరక చతుర్దశి, కాళీపూజ సందర్భంగా అహ్మదాబాద్, బెంగళూరు, న్యూఢిల్లీ, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో బ్యాంకులు బంద్. అక్టోబర్ 21: దీపావళి, గోవర్ధన్ పూజ సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ముంబయి, నాగ్పూర్, శ్రీనగర్ సహా పలు నగరాల్లో బ్యాంకులు బంద్. అక్టోబర్ 22: దీపావళి, విక్రమ్ నూతన సంవత్సరం, బలిపాడమి సందర్భంగా ముంబయి, పాట్నా, గ్యాంగ్టక్ సహా పలు ప్రాంతాల్లో బ్యాంకు సెలవు. అక్టోబర్ 23: భాయ్దూజ్, చిత్రగుప్త జయంతి సందర్భంగా అహ్మదాబాద్, కోల్కతా, లక్నో, సిమ్లాలో బ్యాంకుల మూసివేత. అక్టోబర్ 25: నాలుగో శనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా సెలవు. అక్టోబర్ 26: ఆదివారం సందర్భంగా బ్యాంకులు మూసివేత. అక్టోబర్ 27: ఛఠ్పూజ సందర్భంగా కోల్కతా, పాట్నా, రాంచీల్లో బ్యాంకులు బంద్. అక్టోబర్ 28: ఛఠ్పూజ సందర్భంగా మళ్లీ కోల్కతా, పాట్నా, రాంచీల్లో సెలవు. అక్టోబర్ 31: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా అహ్మదాబాద్లో బ్యాంకులు బంద్.

