మెగా బ్రదర్స్ కంటే.. ఫ్యాన్సే నయం..బాలకృష్ణపై 300కు పైగా కేసులు

అసెంబ్లీ వేదికగా మెగాస్టార్ చిరంజీవి ఉద్దేశిస్తూ నందమూరి బాలకృష్ణ చేసిన వ్యంగ్య వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో పెను దుమారాన్ని సృష్టించాయి. ప్రజాక్షేత్రంలో, చట్టసభల సాక్షిగా చేసిన ఈ వ్యాఖ్యలపై మెగా అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే బాలకృష్ణ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
మెగా కుటుంబంపై బాలకృష్ణ గతంలోనూ అనేకసార్లు అవమానకరంగా మాట్లాడినప్పటికీ, వివాదాలకు దూరంగా ఉండే చిరంజీవి గారు ఎప్పుడూ స్పందించలేదు. అభిమానులు సైతం ఆయన మనసెరిగి సంయమనం పాటించారు. అయితే, ఇప్పుడు చట్టసభల్లో సైతం చిరంజీవి గారి ప్రతిష్టను దిగజార్చే విధంగా మాట్లాడటంపై అభిమానులు నిప్పులు చెరుగుతున్నారు. ఈ వ్యాఖ్యలు తమ దైవమైన చిరంజీవి సైతం బాధించాయని, ఆయన ప్రతిస్పందన ద్వారా అది స్పష్టమవుతోందని అభిమానులు పేర్కొన్నారు.
బాలకృష్ణ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహానికి గురైన మెగా అభిమానులు, చట్టపరమైన చర్యలకు సిద్ధమయ్యారు. అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో సమావేశమైన అభిమాన సంఘాల ప్రతినిధులు, బాలకృష్ణపై రెండు తెలుగు రాష్ట్రాల్లోని 300కి పైగా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. దీనికి తొలి అడుగుగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయడానికి వారు సిద్ధమయ్యారు. అయితే, ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి వెంటనే రంగంలోకి దిగారు. అభిమాన సంఘాల నాయకులకు ఫోన్ చేసి, కేసుల నిర్ణయాన్ని విరమించుకోవాలని సూచించారు. అలా కేసులు పెట్టడం మన సంస్కారం కాదు, ఆవేశంతో అలాంటి పనులు చేయకూడదు అని ఆయన అభిమానులకు నచ్చజెప్పారు. చిరంజీవి మాటను శిరసావహించిన అభిమానులు, తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.
ఈ పరిణామాన్ని మీడియాకు వెల్లడించిన అభిమానులు, బాలకృష్ణ వ్యాఖ్యలను ఖండించినప్పటికీ, తమ అభిమాన నటుడి సూచన మేరకే వెనక్కి తగ్గినట్లు తెలిపారు. అయితే, భవిష్యత్తులో తమ అన్నయ్యపై ఎవరైనా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని వారు స్పష్టం చేశారు. మొత్తానికి, చిరంజీవి సమయోచిత జోక్యం కారణంగా ఇద్దరు అగ్ర నటుల అభిమానుల మధ్య పెద్ద గొడవ జరగకుండా సద్దుమణిగింది. ఈ చర్యతో చిరంజీవి మరోసారి తన పరిణతిని చాటుకున్నారు. Published On September 30, 2025

