60 ఏళ్ల తర్వాత మతిమరుపు సాధారణమా, లేదంటే ఏదైనా వ్యాధికి సంకేతమా? డాక్టర్ ఏం చెప్పారో తెలుసా

సాధారణంగా ఎవరికైనా వయసు పైబడే కొద్దీ ఆరోగ్య సమస్యలు వస్తాయి. అయితే, చాలా మందిలో మతిమరుపు ఉంటుంది. ఏదైనా విషయాన్ని మర్చిపోవడం, వస్తువులు ఎక్కడో పెట్టి మర్చిపోవడం లాంటి జరుగుతూ ఉంటాయి. అయితే, ఇదే విషయాలు రెగ్యులర్‌గా జరిగితే మాత్రం అలర్ట్ కావాల్సిందేనని నిపుణులు అంటున్నారు.
60 ఏళ్ల తర్వాత ఎవరైనా సరే అంత యాక్టివ్‌గా ఉండకపోవచ్చు. అందుకు వారి వయసు ఒక కారణం. వయసు పెరిగే కొద్దీ ఎవరి సామర్థ్యం అయినా తగ్గిపోతుంది. ఇక, 60 ఏళ్లు పై బడ్డ వారు ఎదుర్కోనే అతి సాధారణ సమస్య మతిమరుపు. వీళ్లు చిన్న చిన్న విషయాల్ని కూడా మర్చిపోతుంటారు. ఉదహరణకు ఇంటి తాళాలు ఎక్కడో పెట్టి మర్చిపోవడం, వస్తువుల పేర్లు, చిన్న చిన్న విషయాలు మర్చిపోవడం లాంటివి. అయితే, ఇలాంటి లక్షణాలు 60 ఏళ్ల వయసులో సాధారణమా, లేదంటే ఇది ఏదైనా వ్యాధికి సంకేతమా అన్న డౌట్ చాలా మందిలో ఉంటుంది. ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని డాక్టర్ ఎ.ఎస్. బి ప్రదీప్ కుమార్, కన్సల్టెంట్ న్యూరాలజీ, ఫోర్టిస్ హాస్పిటల్ నాగరభావి అందించారు. ఆ విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.
వయసు పెరిగే కొద్దీ జీవితంలో సూక్ష్మమైన కానీ ఊహించిన మార్పులు వస్తాయి. సన్‌గ్లాసెస్, ఇంటి తాళాలు ఎక్కడో పెట్టి మర్చిపోవచ్చు. మీకు బాగా తెలిసిన వారు పేరు మర్చిపోవచ్చు. ఇందుకు ప్రధాన కారణం.. మీ న్యూరాన్లు కొంచెం తక్కువ సమర్థవంతంగా పనిచేయవచ్చు. అప్పుడప్పుడు మరచిపోవడం అనేది మీ మెదడును వృద్ధాప్యం చేయడంలో భాగం. ఈ వయసులో అంత యాక్టివ్‌గా ఉండకపోవచ్చు. కొంచెం నెమ్మదిగా కదలవచ్చు. పనులు చేయడానికి ఎక్కువ సమయం తీసుకోవచ్చు లేదా మధ్యాహ్నం నిద్రపోవచ్చు. ఇవి ప్రతి ఒక్కరూ చేసే రోజువారీ మార్పులు. ఇవి సాధారణ మతిమరపు కిందకి వస్తాయి. ఈ జ్ఞాపకశక్తి లోపాలు రోజువారీ జీవితాన్ని గణనీయంగా ప్రభావితం చేయవు.
చిత్త వైకల్యం (డెమెన్షియా)
అయితే, సాధారణ మతిమరుపు కన్నా చిత్త వైకల్యం లక్షణాలు కొంచెం భిన్నంగా ఉంటాయి. ఇక్కడే మనం అలర్ట్ కావాల్సి ఉంటుంది. చిత్త వైకల్యం అనేది అప్పుడప్పుడు మర్చిపోవడం కంటే ఎక్కువ. జ్ఞాపకశక్తి సమస్యలు రోజువారీ దినచర్యలో భాగమైనప్పుడు ఈ సమస్య వచ్చినట్టే. ఉదాహరణకు ఇంటి తాళాలు ఎక్కడో పెట్టి మర్చిపోవడం సాధారణం. కానీ, ఇదే విషయం రోజూ జరుగుతుంటే అప్రమత్తత అవసరం.
చిత్త వైకల్యం లక్షణాలు
* కొత్త సమాచారాన్ని నేర్చుకోవడంలో ఇబ్బంది, కమ్యూనికేషన్లో ఇబ్బంది
* ఇటీవల నేర్చుకున్న సమాచారం మర్చిపోవడం
* ముఖ్యమైన తేదీలు లేదా సంఘటనలను మర్చిపోవడం
* అడిగిన సమాచారాన్ని పదే పదే అడగడం
* మానసిక స్థితి మార్పులు
* ఆర్థిక నిర్వహణ అంటే డబ్బుకి సంబంధించిన విషయాల్లో గందరగోళం
* స్నేహంగా ఉండే వ్యక్తి.. అందరికి దూరంగా ఉండటం
* స్పష్టంగా మాట్లాడటంలో ఇబ్బంది
* ఈ లక్షణాలు తరచుగా లేదా స్థిరంగా తీవ్రమవుతాయి. అందుకే ఈ లక్షణాల్ని నిర్లక్ష్యం చేయకూడదని డాక్టర్ చెబుతున్నారు.
