తిరుమల శ్రీవాణి టికెట్ల వివాదంపై టీటీడీ వివరణ.. నిరాధార ఆరోపణలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరిక..!

తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతోంది. టీటీడీ శ్రీవాణి టికెట్ల జారీ ఆలస్యం ఆరోపణలపై స్పందించింది. వసతి గదులు పరిశుభ్రంగా ఉన్నాయని, నిరాధార ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది. తిరుమలలో భక్తుల రద్దీ రోజు రోజుకు పెరుగుతోంది. ఆ రద్దీని సమర్థంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా, కొందరు భక్తులు అప్పుడప్పుడూ కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా జూలై 3న ఉదయం శ్రీవారి ఆలయం వద్దకు వచ్చిన నలుగురు భక్తులు, శ్రీవాణి టికెట్ల జారీ ఆలస్యమవుతోందని, వసతి గదులు సరిగా లేవని ఆరోపించారు.
ఈ ఆరోపణలపై టీటీడీ స్పందించింది. ప్రతిరోజూ ఉదయం 8.30కి శ్రీవాణి టికెట్లు జారీ చేస్తామని, కనీసం గంట ముందే కౌంటర్ వద్దకు భక్తులు రావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అయితే వేకువజామున 3.30కే వచ్చిన భక్తులు ఆలస్యమైందని చెబుతుండటం వాస్తవాలకు దూరమని టీటీడీ వివరణ ఇచ్చింది. టికెట్ కౌంటర్ తెరవకముందే క్యూలైన్లో ఉండే భక్తులకు టీ, కాఫీ, పాలు, మజ్జిగ వంటి పానీయాలు అందిస్తామని తెలిపింది. ఈ ఏర్పాట్లకు సంబంధించిన ఫోటోలు కూడా అధికారులు చూపించారు.
ముఖ్యంగా గురు, శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు లేకుండా ఉండటంతో ఎక్కువ మంది భక్తులు శ్రీవాణి దర్శనానికి ఆసక్తి చూపుతున్నారు. మరుసటి రోజు దర్శనం కోసం పరిమిత సంఖ్యలో టికెట్లు కేటాయిస్తారని టీటీడీ గుర్తు చేసింది. ఈ సందర్భంగా వసతి విషయంలోనూ టీటీడీ క్లారిటీ ఇచ్చింది. తిరుమలలో ఎక్కువ వసతి గదులు సాధారణ భక్తులకే కేటాయిస్తారని, శ్రీవాణి దాతలు ఎక్కువగా తిరుపతిలో బస చేసి దర్శనానికి వెళ్తారని వివరించింది. కొంతమంది మాత్రమే తిరుమలలో గదులు కోరుకుంటే, అందుబాటులో ఉన్న గదులు మాత్రమే ఇవ్వగలమని తెలిపింది.

