అమెరికా ఇండియా కనెక్ట్‌

భారత్‌-అమెరికా మధ్య కృత్రిమ మేధ అనుసంఽధానాన్ని (ఏఐ కనెక్టివిటీ) పెంచేందుకు సముద్ర గర్భం లో ఫైబర్‌ ఆప్టిక్‌ కేబుల్‌ మార్గాలను ఏర్పాటు చేయనున్నట్లు గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌…

న్యూఢిల్లీ: భారత్‌-అమెరికా మధ్య కృత్రిమ మేధ అనుసంఽధానాన్ని (ఏఐ కనెక్టివిటీ) పెంచేందుకు సముద్ర గర్భం లో ఫైబర్‌ ఆప్టిక్‌ కేబుల్‌ మార్గాలను ఏర్పాటు చేయనున్నట్లు గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ ప్రకటించారు. అలాగే, భారత్‌లో గూగుల్‌ భారీ శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టనుందని బుధవారం ఏఐ ఇంపాక్ట్‌ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన వెల్లడించారు.

దేశంలో భారీ నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు..

విద్యార్థులు, కొత్తగా ఉద్యోగంలో చేరినవారి కోసం ఆంగ్లం, హిందీ భాషల్లో గూగుల్‌ ఏఐ ప్రొఫెషనల్‌ సర్టిఫికెట్‌ ప్రొగ్రామ్‌ను ప్రారంభించనుంది. గూగుల్‌ క్లౌడ్‌ ద్వారా 2 కోట్ల మంది ప్రభుత్వ ఉద్యోగులకు భద్రమైన మౌలిక వసతిని అందించనున్నట్లు తెలిపారు. అంతేకాదు, అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్స్‌ ద్వారా 10,000 పాఠశాలలు, 1.1 కోట్ల మంది విద్యార్థులకు జనరేటివ్‌ ఏఐ టెక్నాలజీలో సహకారం అందిచనున్నట్లు పిచాయ్‌ చెప్పారు. కాగా, ఏఐ టెక్నాలజీ ద్వారా క్వాంటమ్‌ కంప్యూటింగ్‌, క్లైమేట్‌ మోడలింగ్‌, ఇతర శాస్త్రీయ విభాగాల్లో ఆవిష్కరణల కోసం కృషి చేస్తున్న పరిశోధకులకు మద్దతిచ్చేందుకు గూగుల్‌ 3 కోట్ల డాలర్ల ఫండ్‌తో ‘ఏఐ ఫర్‌ సైన్స్‌ ఇంపాక్ట్‌ ఛాలెంజ్‌’ను లాంచ్‌ చేసింది.

తదుపరి గ్లోబల్‌ ఏఐ చాంపియన్‌ భారత్‌ నుంచే..

టెక్నాలజీ వినియోగంతో భారత్‌ శరవేగంగా మారుతోందని, తదుపరి ప్రపంచ ఏఐ దిగ్గజం భారత్‌ నుంచే పట్టుకు రావచ్చని సుందర్‌ పిచాయ్‌ అన్నారు.

సరికొత్త గేట్‌వేగా వైజాగ్‌ డేటా సెంటర్‌

ఏపీలోని విశాఖపట్టణం లో 1,500 కోట్ల డాలర్ల (రూ.1.35 లక్షల కోట్లు) పెట్టుబడితో ఏర్పాటు చేయబోతున్న ఏఐ డేటా సెంటర్‌ గిగావాట్‌ సామర్థ్యంతో కూడిన కంప్యూటింగ్‌ వసతితోపాటు అంతర్జాతీయ సముద్ర గర్భ కేబుల్‌ మార్గానికి గేట్‌వే కానుందని పిచాయ్‌ తెలిపారు. ‘ఏఐ టెక్నాలజీలో భారత్‌ అసాధారణ పథాన్ని కలిగి ఉండబోతోంది. ఆ ప్రయాణంలో మేమూ భాగస్వాములం కావాలనుకుంటున్నాం’’ అని ఆయన పేర్కొన్నారు. ఏఐలో భారత్‌ అద్భుత సామర్థ్యాలను కలిగి ఉందన్నారు. ‘‘ఏఐ మన జీవితకాలంలో చూస్తున్న అతిపెద్ద మార్పు. అలాగే, భారత్‌ లాంటి దేశాలకు కూడా. తరాల నాటి అంతరాలను అధిగమించడంతోపాటు కొత్త అవకాశాలను ఏఐ సృష్టించనుంది’’ అన్నారు.

ఏంటీ ప్రాజెక్టు ..?

అమెరికా-ఇండియా కనెక్ట్‌ ప్రాజెక్టులో భాగంగా గూగు ల్‌ భారత్‌ నుంచి సింగపూర్‌, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య సముద్ర గర్భం నుంచి కొత్త కేబుల్‌ మార్గాలను ఏర్పాటు చేయనుంది. ఇందులో భాగంగానే వైజాగ్‌లో ఏర్పాటు చేస్తున్న ఏఐ డేటా సెంటర్‌ను కొత్త కేబుల్‌ మార్గాల ద్వారా సింగపూర్‌, దక్షిణాఫ్రికాతో అనుసంధానించనుంది. ముంబై నుంచి దక్షిణ ఆస్ట్రేలియాకు కేబుల్‌ రూట్‌ను ఏర్పాటు చేయనుంది. కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఈ మూడు కేబుల్‌ మార్గాలను ఇప్పటికే ఏర్పాటైన నాలుగు వ్యూహాత్మక ఫైబర్‌ ఆప్టిక్‌ కేబుల్‌ మార్గాలతో జోడించనుంది. తద్వారా భారత్‌తోపాటు దక్షిణ ప్రపంచంలోని పలు ప్రాంతాలకు చెందిన ఏఐ మౌలిక వసతులను అమెరికాతో అనుసంధానించనున్నట్ల్లు గూగుల్‌ తెలిపింది. ఈ ప్రాజెక్టులో భాగంగా వైజాగ్‌ డేటా సెంటర్‌ అంతర్జాతీయ కేబుల్‌ గేట్‌వేగా అవతరించనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top