బ్లాక్ లిస్ట్‌లో.. ధురంధర్ నిర్మాణ సంస్థ! ముంబైలో షూటింగ్స్‌కు.. పర్మిషన్ లేనట్టే!

‘ధురంధర్ 2’ షూటింగ్ సమయంలో నిబంధనలను చిత్ర నిర్మాణ సంస్థ ఉల్లంఘించిందని బీఎంసీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కంపెనీని, షూటింగ్ కోసం దరఖాస్తు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను బీఎంసీ బ్లాక్ లిస్ట్ లో పెట్టింది.

గత యేడాది విడుదలైన హిందీ చిత్రం ‘ధురంధర్’ (Dhurandhar) సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఆ యేడాది అదే బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ .1400 కోట్లకు పైగా గ్రాస్‌ను వసూలు చేసింది. దీంతో మార్చి 19న విడుదల కానున్న ఈ సినిమా సీక్వెల్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ‘ధురంధర్’ చిత్రాన్ని కేవలం హిందీలోనే విడుదల చేసిన ఈ సినిమా దర్శక నిర్మాత ఆదిత్య ధర్ (Adithya Dhar) ఇప్పుడు ప్రధాన భారతీయ భాషల్లో సీక్వెల్‌ను విడుదల చేయడానికి పథక రచన చేస్తున్నారు.

అయితే ఈ సీక్వెల్‌కి సంబంధించిన కొన్ని సన్నివేశాలను ఇటీవల ముంబైలో చిత్ర నిర్మాణ సంస్థ బి62 స్టూడియోస్ చిత్రీకరించింది. ఈ సందర్భంగా బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నిబంధనలను సంస్థ అతిక్రమించినట్టు గుర్తించిన అధికారులు ఈ నిర్మాణ సంస్థకు లక్ష రూపాయలు జరిమానా విధించడంతో పాటు అది కట్టిన డిపాజిట్‌ను జప్తు చేశారు. అంతేకాకుండా భవిష్యత్తులో ఈ నిర్మాణ సంస్థకు ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదనే నిర్ణయం తీసుకున్నారట.

ముంబైకు చెందిన ఓ ప్రముఖ దిన పత్రిక కథనం ప్రకారం ‘ధురంధర్’ సినిమా నిర్మాణ సంస్థ బి62 స్టూడియోస్‌తో పాటు మరో ఇద్దరు వ్యక్తులను బీఎంసీ బ్లాక్ లిస్ట్‌లో పెట్టడానికి నిర్ణయించుకుంది. ఆ ప్రతిపాదనను జోన్ 1 డిప్యూటీ మున్సిపల్ కమీషనర్ ఆమోదం తెలిపారు. అయితే ఈ నిర్ణయం వెనుక పెద్ద కథే నడించిందని అధికారులు చెబుతున్నారు. బీఎంసీ నుండి షూటింగ్‌కు అనుమతి తీసుకున్న ఈ సంస్థ ప్రతినిధులు కోమల్ ప్రోఖియాల్, నాసిర్ ఖాన్ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించారన్న ది ప్రధాన ఆరోపణ. అనుమతి లేకుండానే బిల్డింగ్‌ టెర్రస్ మీద షూటింగ్ చేశారని, ఆ సమయంలో రెండు జనరేటర్ వ్యాన్‌లను వాడారని వారిపై అభియోగం మోపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top