నంద్యాల: ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం, నవనారసింహుల నిలయం అహోబిలంలో రేపు (ఫిబ్రవరి 17) భక్తులకు స్వామివారి దర్శన వేళల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రసిద్ధ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కొన్ని గంటల పాటు దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
ఎందుకు నిలిపివేస్తున్నారంటే?
అహోబిలం క్షేత్రంలో ఫిబ్రవరి 20వ తేదీ నుంచి స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో, బ్రహ్మోత్సవాలకు ముందుగా ఆలయ శుద్ధి కార్యక్రమమైన ‘కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం’ నిర్వహించడం ఆనవాయితీ. అందుకే ఫిబ్రవరి 17న ఆలయ గర్భాలయాన్ని సుగంధ ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా శుద్ధి చేయనున్నారు.
దర్శన సమయాల్లో మార్పులు ఇవే:
తేదీ: ఫిబ్రవరి 17, మంగళవారం.
సమయం: ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 03:00 గంటల వరకు భక్తులకు దర్శనం ఉండదు.
తిరిగి ప్రారంభం: సాయంత్రం 3 గంటల తర్వాత యధావిధిగా భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.
ఆలయ సీఏఓ రామానుజన్ ఈ మేరకు ప్రకటన విడుదల చేస్తూ.. ఈ శుద్ధి కార్యక్రమంలో భాగంగా గర్భగుడిని ప్రత్యేక పరిమళ ద్రవ్యాలతో శుభ్రం చేస్తామని తెలిపారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు ఈ సమయ మార్పును గమనించి ఆలయ సిబ్బందికి సహకరించాలని కోరారు.
బ్రహ్మోత్సవాలకు ముస్తాబు..
నవనారసింహ క్షేత్రమైన అహోబిలం బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 20 నుంచి జరిగే ఈ వేడుకలకు దేశవ్యాప్తంగా భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. ప్రకృతి ఒడిలో వెలసిన ఈ క్షేత్రంలో ఒక్కరోజు గడిపినా పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం.

