విశాఖలో గీతం విశ్వవిద్యాలయం భూములపై వైసీపీ దుష్ప్రచారాన్ని విశాఖ జిల్లా ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండించారు. శాసనసభలో బీజేఎల్పీ నేత, విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు…
విశాఖలో గీతం విశ్వవిద్యాలయం భూములపై వైసీపీ దుష్ప్రచారాన్ని విశాఖ జిల్లా ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండించారు. శాసనసభలో బీజేఎల్పీ నేత, విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడారు. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ, ‘కేవలం రాజకీయ కారణాలతో గీతం భూములు క్రమబద్ధీకరణను గత వైసీపీ ప్రభుత్వం అడ్డుకుంది. విధ్వంస పాలనలో భాగంగా నాడు వర్సిటీ ప్రహరీనీ కూల్చివేసింది. గీతం అత్యంత ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయం. లోకేశ్‌కు బంధువవ్వడం వల్ల భూమి ఇవ్వకూడదనడం సరైంది కాదు. ఉచితంగా ఇవ్వమని వారు కోరడం లేదు. నిర్ణయించిన ధర ఇస్తాం… క్రమబద్దీకరించండి అని కోరుతున్నారు’ అని పేర్కొన్నారు. టీడీపీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ, ‘గీతం 1980లో ఏర్పాటు చేశారు. 1981లో ల్యాండ్‌ను ఎక్వైర్ చేశారు. 20 ఏళ్ల క్రితమే భూ క్రమబద్దీకరణకు ఆ సంస్థ దరఖాస్తు చేసుకుంది. ఆ సంస్థలో చదివిన వారు వేల మంది నేడు విదేశాల్లో ఉన్నారు. కొన్నేళ్ల నుంచి వర్శిటీ ఆధీనంలో ఉన్న భూములను వారికి కేటాయించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం. వైసీపీ ప్రభుత్వం 2023లో ‘ది ఇంటర్నేషనల్ స్కూల్ బెంగళూరు’(టీఐఎ్సబీ)కు ఎకరం రూ.కోటి చొప్పున 11 ఎకరాలు ఇచ్చి… గీతం విషయంలో మాత్రం రాజకీయ రాద్ధాంతం చేస్తోంది.
ఇప్పుడు అక్కడ డిగ్రీలు చదివిన నేతలే ఇక్కడ మాట్లాడుతున్నారు’ అని అన్నారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ… ‘ప్రభుత్వం నిర్ణయించిన ధరను తాము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని గీతం వర్సిటీ చెపుతోందన్నారు. ఇది ప్రతిపాదన దశలో ఉండగానే రాద్ధాంతం చేస్తున్నారు. చంద్రబాబు కుటుంబానికి భూములు ఇస్తున్నారని అనడం సరికాదు. లోకేశ్‌కు తోడల్లుడిగాను, టీడీపీ ఎంపీగా ఉన్నందుకే వైసీపీ కుట్ర రాజకీయం చేయడం దుర్మార్గం’ అని మండిపడ్డారు. ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ… ‘టీడీపీ ఆవిర్భావానికి ముందే గీతం సంస్థ ఉంది. ఎన్నో వేల మంది దానిలో విద్యనభ్యసించారు. అలాంటి సంస్థపై వైసీపీ, ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. జగన్ యూనివర్శిటీలో చుక్క పాలు లేకుండా నెయ్యి తయారు చేసిన ఘనులు ఉన్నారు. గీతం వర్శిటీ నుంచి వచ్చిన రియల్ సైంటిస్టులు 150 దేశాల్లో సేవలు అందిస్తున్నారు’ అని పేర్కొన్నారు.

