చాలా మందికి భోజనం చేసిన తర్వాత కొద్దిసేపు నిద్రపోవాలని అనిపిస్తుంది. అయితే తిన్న తర్వాత నిద్రపోవాలని ఎందుకు అనిపిస్తుంది? దీనికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
భోజనం తర్వాత కొంతమందికి నిద్ర రావడం సాధారణం. తిన్న తర్వాత నిద్ర(Post-meal sleepiness) రావడానికి ప్రధాన కారణం జీర్ణక్రియ కోసం శరీరం ఎక్కువ శక్తిని ఉపయోగించడం, దీనివల్ల మెదడుకు శక్తి తగ్గి మగత కలుగుతుంది. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు మెలటోనిన్ వంటి హార్మోన్ల విడుదల, రక్తపోటులో తాత్కాలిక మార్పులు కూడా నిద్రమత్తుకు కారణమవుతాయి.
తిన్న తర్వాత అప్పుడప్పుడు నిద్ర రావడం, వారానికి ఒకటి లేదా రెండుసార్లు జరిగితే పర్వాలేదని నిపుణులు అంటున్నారు. తిన్న తర్వాత తరచుగా నిద్రపోవాలని అనిపిస్తే, అది డయాబెటిస్ లేదా హైపోథైరాయిడిజం వంటి కొన్ని పరిస్థితులకు సంకేతం కావచ్చు. తిన్న తర్వాత ప్రతిరోజూ మీకు నిద్ర వస్తుందా లేదా అని తెలుసుకోండి. ముఖ్యంగా తేలికపాటి భోజనం చేసినా మీకు నిద్రపోవాలని అనిపిస్తే వైద్యులను సంప్రదించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

