UIDAI: 2.5 కోట్ల మంది ఆధార్ నంబర్లను డీయాక్టివేట్ చేసిన యూఐడీఏఐ

ఆధార్ డేటాబేస్‌ను ఖచ్చితమైన, విశ్వసనీయంగా ఉంచడానికి దేశవ్యాప్తంగా జరుగుతున్న డ్రైవ్‌లో భాగంగా ఈ ప్రక్రియ చేపట్టినట్టు తెలిపింది.

భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ఇప్పటివరకు మరణించిన వ్యక్తులకు చెందిన 2.5 కోట్లకు పైగా ఆధార్ నంబర్‌లను డీయాక్టివేట్ చేసినట్టు వెల్లడించింది. ఆధార్ డేటాబేస్‌ను ఖచ్చితమైన, విశ్వసనీయంగా ఉంచడానికి దేశవ్యాప్తంగా జరుగుతున్న డ్రైవ్‌లో భాగంగా ఈ ప్రక్రియ చేపట్టినట్టు తెలిపింది. ఆధార్ ప్రపంచంలోనే అతిపెద్ద బయోమెట్రిక్ ఐడెంటిటీ వ్యవస్థ, ఇందులో దాదాపు 134 కోట్ల మంది యాక్టివ్ ఆధార్ హోల్డర్లు ఉన్నారు. ఒక వ్యక్తి మరణించిన తర్వాత వారి ఆధార్ నంబర్‌ను డీయాక్టివేట్ చేయడం అవసరం.

దీనివల్ల ఐడెంటిటీ మోసాలను కట్టడి చేయవచ్చు. ప్రభుత్వ సంక్షేమ ప్రయోజనాలను క్లెయిమ్ చేయడానికి ఆధార్ నంబర్‌ను అనధికారికంగా ఉపయోగించే మోసాలను కట్టడి చేయవచ్చని ఐటీ మంత్రిత్వ శాఖ తెలిపింది. గతేడాది నవంబర్‌లో సైతం 2 కోట్లకు పైగా ఆధార్ నంబర్లను డీయాక్టివేట్ చేసినట్టు యూఐడీఏఐ తెలిపింది.

ఈ ప్రక్రియ కోసం యూఐడీఏఐ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (ఆర్‌జీఐ), రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంత అధికారులు, ప్రజా పంపిణీ వ్యవస్థ, జాతీయ సామాజిక సహాయ కార్యక్రమాల నుంచి డేటాను సేకరించింది. మరణించిన వ్యక్తుల ధృవీకరణ రికార్డుల కోసం బ్యాంకులు, ఇతర సంస్థలతో కలిసి పనిచేసే అంశంపైనా యూఐడీఏఐ పరిశీలిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top