ఇక్కడ నడిస్తే దీర్ఘాయువు..

హైదరాబాద్‏లోని జూబ్లీహిల్స్‌లోగల హెర్బల్‌ పార్కు పలువురిని ఆకట్టుకుంటోంది. అభయారణ్యాల్లో లభించే వందలాది రకాల మొక్కలు ఇక్కడ ఉండడంతో చాలామంది ఈ పార్కుకు విచ్చేసి సేదతీరుతున్నారు. జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబర్‌.10లో 2004లో దాదాపు 12 ఎకరాల విస్తీర్ణంలో ఔషధ సుగంధవనం(హెర్చల్‌పార్కు)ను జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసింది.

పచ్చదనం శోభిస్తే.. ప్రకృతి పులకిస్తుంది. పిల్లగాలులు, చల్లగాలులు మనస్సును హాయిగా పలకరిస్తాయి. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్‌ పుణ్యమా అని ఆ వాతావరణం కాస్తా కాలుష్యంగా మారుతోంది. గాలి పీల్చాలంటే భయపడే పరిస్థితి. దీనికి తోడు కాంక్రీట్‌ జంగిల్‌లా మారిన నగరంలో పచ్చదనమూ కరువవుతోంది. ఈ పరిస్థితుల్లో జూబ్లీహిల్స్‌(Jubilee Hills)లోని ఔషధ సుగంధవనం ఆరోగ్యప్రదాయనిగా మారింది. చల్లని గాలులే కాదు.. ఆరోగ్యాన్ని పంచే అద్భుతమైన మొక్కలూ ఇక్కడ దర్శనమిస్తున్నాయి. ఇందులో నడిస్తే చాలు దీర్ఘాయువు ప్రాప్తిస్తుంది. జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబర్‌.10లో 2004లో దాదాపు 12 ఎకరాల విస్తీర్ణంలో ఔషధ సుగంధవనం(హెర్చల్‌పార్కు)ను జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసింది. ఇందులో పలు ఔషధ మొక్కలను నాటి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అందులో భాగంగానే దాదాపు 143 రకాలకు పైగా ఔషధాల మొక్కలను ఇక్కడ పెంచుతున్నారు.

కాసేపు నడకతో కొత్త ఉత్సాహం

ఈ ఔషధ సుగంధవనం చాలామందికి ఆరోగ్యాన్ని పంచుతోంది. ఈ పార్కుల పక్కన ఉండే నివాసాల వారు దీనిని ధ్రువీకరిస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో నడక సాగించే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఈ పార్కులు ఆరోగ్యప్రదాయనిగా ఉపయోగపడుతున్నాయని చెబుతున్నారు జూబ్లీహిల్స్‌కు చెందిన శ్రీకాంత్‌రెడ్డి. కాసేపు సేద తీరినా అది మనసుకు, మెదడుకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తోందంటున్నారు.

ఆసక్తి కలిగించేందుకు మరిన్ని..

హెర్బల్‌ పార్కుల పట్ల ఆసక్తి కలిగించేందుకు అర్బన్‌ ఫారెస్ట్రీ శాఖ మరిన్ని ఔషధ మొక్కల పార్కులను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉంది. స్థానికుల అభిప్రాయాలకు విలువనిస్తూ పలు పార్కుల్లో అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు చేసింది. నిధులతోపాటు జీహెచ్‌ఎంసీ అనుమతిస్తేనే ఇది సాధ్యమవుతుంది. సాదారణ పార్కుల్లో అందమైన మొక్కల చెంత ఔషధ చెట్లను పెంచుతున్నారు. నెల క్రితం హరితహారంలో కూడా వేప, తులసి లాంటి మొక్కలను అధికంగా పంచారు. మామిడి, దానిమ్మ లాంటి చెట్లలో కూడా ఔషధ గుణాలు ఉంటాయని అధికారులు అంటున్నారు.

పలు రకాల మొక్కలు..

తులసి రకాలు, నేలవాము, ఎర్రచందనం, చందనం, రణపాల, పాలగడప, ఎర్ర చిత్రమూలం, నందివర్ధనం, విషముష్టి, జాజిమాలతి, కిత్తనార, అమృతవల్లి, కలబంద, పొగడ, అరటి, కాచు, వేప తదితర రకాల మొక్కలన్నింటినీ ఇక్కడ గుర్తించవచ్చు. ప్రతీ మొక్క వద్ద దానికి సంబంధించిన పేరు, శాస్త్రీయనామం, ఆ మొక్కలోని ఏయే భాగాలు ఔషధగుణాలు కలిగి ఉంటాయి. ఎలాంటి వ్యాధుల నివారణకు వాటిని ఉపయోగిస్తారనే వివరాలను పొందుపర్చారు. తద్వారా విద్యార్థులు, సందర్శకులు మొక్కల పూర్తి వివరాలు తెలుసుకుంటున్నారు.

ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నాం

ఔషధమొక్కల పెంపకంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అశ్వినీ లే అవుట్‌లో ఉన్న పార్కు తలమానికంగా ఉండేలా చర్యలు చేపట్టాం. ఇక్కడ అభయారణ్యాల్లో లభించే చెట్లను కూడా అందుబాటులో ఉంచాం. మొక్కలు చచ్చిపోయినా, పాడైపోయినా వెంటనే వాటిని తొలగించి కొత్త వాటిని నాటుతున్నాం. పార్కుకు వచ్చే వారు ఔషధ మొక్కల గురించి క్షుణ్ణంగా తెలుసుకునే విధంగా బోర్డులు పెట్టాం. పిల్లలు ఆడుకునేందుకు వినూత్న ఏర్పాట్లు చేశాం.

– బాలయ్య, హార్టికల్చర్‌ అధికారి

పిల్లల కోసం..

ఔషధ మొక్కల ప్రత్యేకతను భవిష్యత్తు తరాలకు తెలియజేసేలా అధికారులు చిన్నారులను ఆకట్టుకునేందుకు వినూత్నంగా ఆలోచించారు. పిల్లలు నిత్యం ఆడుకునే స్నేక్‌ అండ్‌ ల్యాడర్‌, లూడో, మేజ్‌, హ్యాండ్స్‌ అండ్‌ ఫీట్‌ తదితర ఆటలను ఇక్కడ భౌతికంగా ఏర్పాటు చేశారు. చెస్‌ ఆడాలంటే పిల్లలు కాయిన్స్‌ ఆడకుండా వారే అందులో లీనమై ఆడేలా సిద్ధం చేశారు. తద్వారా పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు ఇక్కడకు వచ్చి ఆడుకోవడమే కాకుండా ఔషధ మొక్కల గురించి తెలుసుకునేలా ఏర్పాట్లు చేశారు. అంతేగాదు సాయంత్రం అలా సేద తీరేందుకు బండరాయిని మెట్ల మార్గంగా మార్చి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top